జెనరేటివ్ ఏఐ నగరంగా గ్రేటర్ హైదరాబాద్‌

by Naga Rani Yarlagadda |

నగర పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) గూగుల్‌తో చేతులు కలిపింది.

జెనరేటివ్ ఏఐ నగరంగా గ్రేటర్ హైదరాబాద్‌
X
  • పౌర కేంద్రీకృతగా ప్రాజెక్ట్ అమలు
  • సాంకేతికత దన్నుగా పౌర సమస్యలకు పరిష్కారం
  • జీహెచ్ఎంసీ-గూగుల్‌ భాగస్వామ్యంతో పైలట్‌ ప్రాజెక్ట్‌

దిశ, సిటీ బ్యూరో: నగర పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) గూగుల్‌తో చేతులు కలిపింది. నగరంలోని ప్రధాన పౌర సమస్యలను పరిష్కరించడానికి, పౌర సేవలను మెరుగుపరచడానికి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ) (ఏఐ కంటే అడ్వాన్స్) ఆధారిత పైలట్‌ ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ను జనరేటివ్‌ ఏఐ నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పానికి ఈ ప్రాజెక్ట్‌ ఒక ముందడుగు. సోమవారం సాయంత్రం ఈ ప్రాజెక్ట్‌ అమలుపై చర్చించేందుకు పురపాలక శాఖ కార్యదర్శి డా కె ఇలంబరితి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్, ఐటీ అదనపు కమిషనర్ అనురాగ్ జయంతిలు గూగుల్ క్లౌడ్ ప్లాట్ ఫాం టీమ్ తో గూగుల్‌ మీట్‌ ద్వారా వర్చువల్‌ సమావేశానికి హాజరయ్యారు. ఈ జనరేటివ్‌ ఏఐ పైలట్‌ ప్రాజెక్ట్‌ భవిష్యత్‌ టెక్‌ ఆధారిత పరిష్కారాలను అన్వేషించి, స్మార్ట్‌ , పౌర సమస్యలపై సత్వరమే స్పందించే నగర పాలన నిర్మాణం పై దృష్టి సారించనుంది.

ఏఐ అమలు చేసే అంశాలివే..

జెనరేటివ్ ఏఐ ఆధారిత ప్రభుత్వ, పౌర సేవలు, ప్రభుత్వ వెబ్‌సైట్ల కోసం జనరేటివ్‌ ఏఐ సెర్చ్‌ బార్ ను వినియోగించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం కన్వర్సేషనల్‌ చాట్‌బాట్‌లు, ఏఐ సెర్చ్‌ టూల్స్‌, పౌరుల విచారణల వర్గీకరణ కోసం ఏఐ సిస్టమ్, గవర్నమెంట్ టు సిటిజన్ సేవల కోసం బ్లాక్‌చెయిన్‌ ఆధారిత ధృవీకరణ క్రెడెన్షియల్స్‌ వినియోగించాలని నిర్ణయించారు. ఏఐ ఆధారిత టెండర్‌ మూల్యాంకన వ్యవస్థ, ఏఐతో స్మార్ట్‌ పార్కింగ్‌ నిర్వహణ, ఏఐతో సమర్థ ఘన వ్యర్థ నిర్వహణ, పౌర దరఖాస్తుల కోసం ఆటోమేటెడ్‌ ఫారమ్‌ ఫిల్లింగ్‌, గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా పబ్లిక్‌ బస్సుల రియల్‌-టైమ్‌ ట్రాకింగ్‌ రోడ్‌ సేఫ్టీ, ట్రాఫిక్‌ మోడల్స్‌-కంప్లైంట్‌ హెల్త్‌ రికార్డుల కోసం గూగుల్‌ క్లౌడ్‌ వంటి వాటిని నిర్వహించాలని నిర్ణయించారు. నగరవ్యాప్త హెల్త్‌ అనలిటిక్స్‌ ప్లాట్‌ఫామ్‌, కీటక జనిత వ్యాధుల నివారణ, సత్వర వైద్య సేవలు, లేక్స్ లో చెత్త, సీ అండ్ డీ వ్యర్థాల పారబోత నివారించేందుకు పర్యవేక్షణ, ఆశా వర్కర్ల కోసం “మాన్య” –ఏఐ అసిస్టెంట్‌ వంటి సేవలను వినియోగించనున్నారు.

పైలట్ ప్రాజెక్ట్ ఇలా..

జీహెచ్ఎంసీ డిజిటల్ పరివర్తన ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలవనుంది. విజయవంతంగా పరీక్షించిన తర్వాత, ఈ జెన్ ఏఐ ప్రాజెక్ట్ నగరవ్యాప్తంగా విస్తరించబడనుంది. హైదరాబాద్ స్మార్ట్, టెక్-ఆధారిత పట్టణ జీవనానికి ఓ నమూనాగా ఇది నిలువనుంది. గూగుల్ భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ పరిధిలో అమలు చేయనున్న జనరేటివ్‌ ఏఐ పైలట్‌ ప్రాజెక్ట్‌ కేవలం ఒక సాంకేతిక ప్రయోగం మాత్రమే కాదని, పౌరులందరికీ స్మార్ట్, ఆరోగ్యకరమైన, ఫ్రెండ్లీ, హైదరాబాద్‌ను నిర్మించే దిశగా ఒక ముందడుగు అని కమిషనర్ ఆర్వీ. కర్ణన్ తెలిపారు. నగర పౌరుల నిత్య జీవన ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని కమిషనర్ తెలిపారు.

Next Story