రాష్ట్రానికి నిధులు మంజూరు చేయండి.. కేంద్ర మంత్రికి సీతక్క విజ్ఞప్తి

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలు సజావుగా జరుగుతోందని, కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు.

రాష్ట్రానికి నిధులు మంజూరు చేయండి.. కేంద్ర మంత్రికి సీతక్క విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలు సజావుగా జరుగుతోందని, కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. గురువారం కేంద్ర మంత్రి అధ్యక్షతన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ సచివాలయం నుంచి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనలో భాగంగా కేంద్రం కేటాయించిన రూ.368.7 కోట్లలో ఇప్పటి వరకు రూ.129.64 కోట్లు (35శాతం) వినియోగించామని, మిగిలిన నిధులను నవంబర్‌లోపు పూర్తిగా ఖర్చు చేస్తామని తెలిపారు.

దక్కన్ పీఠభూమి నేలల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఈ పథకానికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి సీతక్క విజ్ఞప్తికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారు. వచ్చే సెప్టెంబర్ 4, 5 తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి మంత్రుల చింతన్ శివిర్ జరుగనుందని, అందులో తెలంగాణ అవసరాలపై ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. తెలంగాణలో అమలవుతున్న వినూత్న పథకాలను ఆ వేదికపై ప్రదర్శించాలని సూచించారు. అలాగే గ్రామీణ మహిళల ఆర్థిక బలోపేతం కోసం కేంద్రం నుంచి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్పందనకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.

Next Story