తెలంగాణ రైతులకు మరికొన్ని రోజులు పడిగాపులు తప్పవా?

by Gantepaka Srikanth |

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు అట్టహాసంగా ప్రారంభించినా నేటికీ కొన్ని కొనుగోలు కేంద్రాలను రైస్ మిల్లులకు కేటాయించలేదు.

తెలంగాణ రైతులకు మరికొన్ని రోజులు పడిగాపులు తప్పవా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు అట్టహాసంగా ప్రారంభించినా నేటికీ కొన్ని కొనుగోలు కేంద్రాలను రైస్ మిల్లులకు కేటాయించలేదు. కేంద్రాలకు సరిపడా గన్నీసంచుల రాకపోవడంతో ధాన్యం సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో సెంటర్ల వద్ద ధాన్యం రాశులుగా పేరుకుపోయాయి. ఈసారి దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చినా మార్కెట్ లో మద్దతు ధరకు అమ్ముకుందామంటే గతం వారం రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలు రైతులకు శాపంగా మారాయి. ఇప్పటికే కొందరు రైతులు కేంద్రాలపై ఆశలు వదలుకుని ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నారు. మిగతా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిద్దామంటే అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది.

70 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్

యాసంగి సీజన్లో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 8209 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. ఇప్పటి వరకు 1900 కేంద్రాలు 15 జిల్లాల్లో ప్రారంభించి 98,450 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.47.14 కోట్లు చెల్లించింది. ఇందులో 93 వేల టన్నులు మిల్లులకు తరలించారు. ధాన్యం సేకరణలో నల్లగొండ, సూర్యాపేట, నిజాబామాద్ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో 20 రోజుల క్రితమే కోతలు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.37 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో 70 లక్షల మెట్రిక్ టన్నులు జూన్30 వరకు సేకరించాలని పౌర సరఫరాల శాఖ టార్గెట్ పెట్టుకుంది.

కొనుగోలు చేయకుండా కొర్రీలు..

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన కొన్ని కేంద్రాల్లో నిర్వాహకులు పచ్చి ధాన్యం, తాలు, సన్నధాన్యంగా లేదని కొర్రీలు పెడుతూ తూకం వేసేందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తేమ 14 శాతం రాకుంటే కేంద్రాల్లో ఎండబెట్టాలని సూచిస్తున్నారు. దీంతో రైతులు రెండు మూడు రోజుల పాటు ధాన్యం ఎండబెట్టి అమ్మకాలు చేస్తున్నారు. అదే విధంగా మిల్లర్లు పంపిన గన్నీ సంచులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు చేస్తూ రైతులు బస్తాలు తెచ్చుకోవాలని లేకుంటే తాము ఇచ్చే వరకు వేచిచూడాలని హెచ్చరిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో సన్నాలకు రూ.500 బోనస్ వస్తుందని ధాన్యం తీసుకెళ్తే నిర్వాహకుల తీరుతో ప్రైవేటు వ్యాపారులకు అమ్మడం మేలనే భావనలో అన్నదాతలు ఉన్నారు.

పొంచి ఉన్న వర్షాల ముప్పు

గత ఐదారు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులకు చేను నేలకొరిగింది.. దీంతో వరి కోత యంత్రాల యాజమానులు కూడా ధరలు పెంచారు. ఎవరు ఎక్కువ ధర ఇస్తారో వారి పంట కట్ చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం త్వరగా తూకం వేసేందుకు సరిపడా గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

Next Story