మండుటెండలో ‘ధాన్యం’ రాజకీయం.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

by Prasad Jukanti |

తెలంగాణ రాజకీయంలో ధాన్యం కొనుగోళ్ల రచ్చ పీక్స్ కు చేరింది. బీజేపీ, బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పర్యటనలు వెళ్లగా కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ చేస్తోంది.

మండుటెండలో ‘ధాన్యం’ రాజకీయం.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఓ వైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు ధాన్యం కొనుగోళ్ల చుట్టూ పొలిటికల్ హీట్ అంతకంతకు పెరిగిపోతోంది. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితిపై ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ మరింత ముందురుతోంది. ధాన్యం కొనాలంటూ విపక్షాలు యాత్రలు మొదలుపెడితే.. అధికార పక్షం కౌంటర్ల పర్వానికి తెరలేపింది. మొత్తానికి తమ ధాన్యం కొనుగోలు చేస్తే చాలు దేవుడా అని రైతులు దీనంగా చూస్తుంటే మరోవైపు రాజకీయ పార్టీల యాత్రలు రాష్ట్ర రాజకీయాన్ని మండుటెండలో మరింత హాట్‍హాట్‍గా మారుస్తోంది.

వ్యవసాయ మార్కెట్ కు బీజేపీ:

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని ప్రత్యక్ష్యంగా పరిశీలించేందుకు ఇవాళ తెలంగాణ బీజేపీ నేతలు క్షేత్రస్థాయి పర్యటన మొదలు పెట్టారు. టీ బీజేపీ చీఫ్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇవాళ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ ను సందర్శించారు. ధాన్యం కొనుగోలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని బీజేపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో పంటల దిగుబడిపై ప్రభుత్వానికి సరైనా ప్రణాళిక లేదని విమర్శించారు. రైతు నుంచి నేరుగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి వారికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

వేలాది మంది రైతులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం: బీఆర్ఎస్

బీజేపీ క్షేత్రస్థాయి పర్యన కొనసాగుతున్న వేళ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సైతం ఎన్సాన్ పల్లి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే.. నేనే స్వయంగా వేలాది మంది రైతులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తానని ప్రభుత్వానికి హరీశ్ రావు డెడ్ లైన్ విధించారు. వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వానిది మిషన్ మోడ్ కాదు.. కమిషన్ మోడ్ అంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి గారడీ మాటలు, ఢిల్లీ ట్రిప్పులు ఆపి.. కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులు పెంచాలన్నారు. క్వింటాల్‌కు 5 కిలోల తరుగుతో రైతులు నిలువునా మోసపోతున్నా మంత్రులకు, అధికారులకు పట్టింపు లేదని సిద్దిపేట గడ్డపై 45 రోజుల్లో పూర్తి రైతుబంధు ఇస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం.. 63 రోజులైనా ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు.

బస్సు యాత్ర కాదు ఢిల్లీ యాత్ర చేయండి: కాంగ్రెస్

ఇక బీజేపీ, బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పర్యటనలోపై కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోందని బీజేపీ నేతలు బస్సు యాత్ర కాదు ఢిల్లీ యాత్ర చేయాలన్నారు. ఇక హరీశ్ రావు కల్లాల దగ్గరికి వెళ్లి షో చోస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనన్నారు. బీజేపీ నాయకుల్లో ఒకరంటే ఒకరికి పడదని రైతులపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. బీజేపీని బీఆర్ఎస్ ఒక్కమాట కూడా అనడం లేదన్నారు.

Next Story