- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కారీ బడుల గోడల మధ్య ఫైనాన్స్ దందాల ఊసులు..!
బతకలేక బడిపంతులు అన్నది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుతం ఏ దందాలో చూసిన సర్కారు బడిపంతుళ్ల హవానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: బతకలేక బడిపంతులు అన్నది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుతం ఏ దందాలో చూసిన సర్కారు బడిపంతుళ్ల హవానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, చిట్టీలు, బినామీల పేరిట ప్రైవేట్ బడులు, కమిషన్ల కోసం కార్పొరేట్ విద్యాసంస్థల అడ్మిషన్లు ఇలా ఎందులో చూసినా టీచర్ల మార్క్ కనిపిస్తుంది. అయితే ఇదంతా సక్రమమే అనుకుంటే పొరపాటే..! నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన టీచర్లే దొంగ చాటుగా అక్రమ దందాలు చేస్తూ సైడ్ ఇన్కమ్ కోసం గీత దాటతున్నారు. ఇటీవల జిల్లావ్యాప్తంగా అక్రమ ఫైనాన్స్ చేస్తున్న వారిపై పోలీసులు జరిపిన దాడుల్లో ప్రభుత్వ టీచర్ల పేర్లు తెరపైకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ముఖ్యంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణంలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్న ప్రభుత్వ టీచర్ల అక్రమ వడ్డీ వ్యాపారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కీలక దందాలలో వారిదే హవా
విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు కాసులకు కకృత్తి పడి వక్రమార్గాలను ఎంచుకుంటున్నారు. జిల్లాలో జరిగే అక్రమ వడ్డీ వ్యాపారులతో ప్రభుత్వ ఉపాధ్యాయులు పోటీపడుతూ వారి హవా కొనసాగిస్తున్నారు. పల్లె, పట్టణం అని తేడా లేకుండా జోరుగా కొనసాగుతున్న చిట్టీల వ్యాపారం కూడా వారే అధికంగా నడుపుతున్నారు. వాస్తవానికి చిట్టీల వ్యాపారం నిర్వహించాలంటే చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం జిల్లా రిజిస్ట్రార్ శాఖ నుంచి అనుమతులు పొందాలి. కానీ ఏలాంటి అనుమతులు లేకుండానే చిట్టీల వ్యాపారం కొనసాగిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి వారు గండి కొడుతున్నారు.
అంతేకాకుండా బడా వ్యాపారులతో పాటు చిన్నాచితక వ్యాపారులు, అమాయక ప్రజల అవసరాలే ఆసరాగా చేసుకుని ఫైనాన్స్ దందా కొనసాగిస్తున్నారు. 5 నుంచి 10 రూపాయల వరకు అధిక వడ్డీకి రుణాలు ఇస్తూ రుణగ్రస్తుల నడ్డి విరుస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫైనాన్స్ దందా సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు పలు మండలాల్లో జోరుగా సాగుతోంది. అలాగే మరి కొంతమంది గవర్నమెంట్ టీచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు కరీంనగర్, హైదరాబాదు నగరాలలో అనుమతి లేని వెంచర్లలో భాగస్వాములు అవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, నమ్మకస్తులకు ఫ్లాట్లను అంటగడుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.
యూనియన్ల పేరుతో కార్పొరేట్ సంస్థలకు ఊడిగం
కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు యూనియన్ల ముసుగులో సొంత వ్యాపారంలో బిజీ అవుతున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాల పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలకు ఊడిగం చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. కమీషన్ల కోసం ప్రైవేటు విద్యాసంస్థలకు పీఆర్వోలుగా వ్యవహరిస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు బినామీల పేరుతో ప్రైవేటు పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల పురోగతికి పాటు పడాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా భాగస్వామ్యులు కావడం విస్మయానికి గురి చేస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యతను మరిచి, వారికున్న పలుకుబడులతో సొంత పాఠశాలల్లో అడ్మిషన్ పెంచుకుంటున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. వారి బినామీలతో నిర్వహిస్తున్న పాఠశాలలకు పూర్తిస్థాయి అనుమతులు లేకపోగా, నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, నోటుబుక్కులు, యూనిఫార్మ్స్, ఇతర సామగ్రిని ప్యాకేజీ రూపంలో విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాజకీయ నాయకుల అండ తోడవడంతో మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా వీరి అక్రమ దందాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఉపాధ్యాయ వృత్తికే తీరని మచ్చ
ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ వ్యాపారాలు చేయడం తప్పేమీ కాకపోవచ్చు. కానీ బావి భారతావనికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు అక్రమంగా దందాలకు పాల్పడడం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉపాధ్యాయ వృత్తికి తీరని మచ్చ తెచ్చేలా వారు తయారవుతున్నారని మేధావి వర్గం అభిప్రాయపడుతుది. అక్రమ వ్యాపారాలు నిర్వహించి కేసుల పాలవుతూ ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవానికి భంగం కల్పిస్తున్నారని వారు అంటున్నారు. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ టీచర్లు వారి వక్రబుద్ధితో చేస్తున్న అక్రమ వ్యాపారాలు మానుకొని, తోటి ఉద్యోగులతో పాటు భవిష్యత్ తరానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
అక్రమ వడ్డీ వ్యాపారాన్ని ఉపేక్షించేది లేదు :జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. జిల్లావ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇటీవల ప్రత్యేక పోలీసు బృందాలతో అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై మూకుమ్మడి దాడులు నిర్వహించాం. దాదాపు రూ.60 లక్షల విలువగల పత్రాలను సీజ్ చేసి, పదిమందిపై కేసులు కూడా నమోదు చేశాం. అక్రమ వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రజలను పీడిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఎవరైనా అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తే పోలీస్ శాఖకు సమాచారం అందించాలి. సమాచార అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. అలాగే ప్రభుత్వ అనుమతులు పొందిన ఫైనాన్స్, చిట్ఫండ్ కంపెనీల వద్దనే అవసరమున్నవారు రుణాలు తీసుకోవాలి.






