అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఎట్టకేలకు సర్కారు పచ్చజెండా

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-28 16:41:15  IST  )

రాష్ట్రంలో కుంటుపడుతున్న నర్సింగ్ విద్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదోన్నతుల స్తబ్దతపై ఈ నెల 19న ‘దిశ’ దినపత్రికలో ప్రచురితమైన “కదలని పదోన్నతుల ఫైల్.. కథనానికి ప్రభుత్వం నుంచి స్పందన లభించింది.

అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఎట్టకేలకు సర్కారు పచ్చజెండా
X
  • కదలని పదోన్నతుల ఫైల్ పేరిట ప్రచురితమైన దిశ కథనానికి స్పందన
  • కానీ అధికారుల తీరుతో గ్రామీణ నర్సింగ్ విద్యార్థులకు అన్యాయం
  • అన్ని కాలేజీలకూ ప్రిన్సిపాల్స్‌ను భర్తీ చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అధికారుల గండి
  • నగరం, సమీప ప్రాంతాలకే ప్రొఫెసర్ల పరిమితం.. గ్రామీణ నర్సింగ్ విద్యార్థులకు తీరని అన్యాయం
  • డీఎంఈలోని కీలక అధికారి వ్యవహారం వల్లే ఈ తతంగం జరిగిందని మంత్రి ఆగ్రహం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కుంటుపడుతున్న నర్సింగ్ విద్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదోన్నతుల స్తబ్దతపై ఈ నెల 19న ‘దిశ’ దినపత్రికలో ప్రచురితమైన “కదలని పదోన్నతుల ఫైల్.. కథనానికి ప్రభుత్వం నుంచి స్పందన లభించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదోన్నతుల ఫైలుపై దిశ కథనం అధికార యంత్రాంగంలో కదలిక తీసుకువచ్చింది. నర్సింగ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్స్ పోస్టులను భర్తీ చేసేందుకు, అర్హులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేసి, గ్రామీణ విద్యార్థులకు సైతం నాణ్యమైన నర్సింగ్ విద్యను అందించాలన్న ప్రభుత్వ ఉన్నత ఆశయానికి క్షేత్రస్థాయిలో కొందరు స్వార్థపరులైన అధికారులు తూట్లు పొడుస్తున్నారు.

నగరానికే పరిమితం.. గ్రామీణ కాలేజీలకు మొండిచేయి!

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసిన సర్కారు, వాటి సజావుగా నిర్వహణ కోసం ఇటీవలే క్యాడర్ స్ట్రెంత్‌ను కూడా మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న 32 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించి, ప్రతి కాలేజీకి ఒక్కొక్కరి చొప్పున పంపి ప్రిన్సిపల్ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావించింది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ విద్యా ప్రమాణాలు పెరుగుతాయని ఆశించింది. కానీ, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) లోని నర్సింగ్ విభాగాన్ని పర్యవేక్షిస్తూ, ఒకేసారి మూడు కీలక పోస్టులను చేతిలో పెట్టుకున్న ఒక ఉన్నతాధికారి సొంత లాభం కోసం ప్రభుత్వ ఉద్దేశాన్ని నీరుగార్చేలా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విభాగంలోని కొందరు ఆమ్యామ్యాలకు ఆశపడి, నిబంధనలను తుంగలో తొక్కి కేవలం హైదరాబాద్, దానికి సమీపంలో ఉన్న నర్సింగ్ కాలేజీల్లోనే ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేలా వేకెన్సీల జాబితాను సిద్ధం చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇప్పటికే గాంధీ, ఉస్మానియా, సంగారెడ్డి నర్సింగ్ కాలేజీలకు ఒరిజినల్ పోస్టుల్లో ప్రిన్సిపల్స్ ఉన్నారు. అయినప్పటికీ, ఈ పదోన్నతుల ప్రక్రియలో కేవలం గాంధీ నర్సింగ్ కాలేజీకే ఏకంగా ఏడుగురిని, ఉస్మానియాకు ఒకరిని, సంగారెడ్డికి ఒకరి చొప్పున అవకాశం కల్పించేలా ఫైలును రూపకల్పన చేసినట్లు సమాచారం. అలాగే కుత్బుల్లాపూర్, యాదాద్రి, మహేశ్వరం, సిద్దిపేట, మెదక్ నర్సింగ్ కాలేజీలకు ముగ్గురు చొప్పున ప్రొఫెసర్లకు పదోన్నతుల్లో అవకాశం కల్పించారని తెలుస్తోంది. దీనివల్ల సుదూర, గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలకు ప్రొఫెసర్లు దక్కకుండా పోయి, అక్కడి పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం వాటిల్లింది.

పదోన్నతుల తీరుపై మంత్రి ఆగ్రహం

డీఎంఈ లోని సదరు అధికారి చేసిన ఈ వ్యవహారం చివరకు ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ఈ వ్యవహారంపై లోతుగా విచారించగా, కొందరి స్వార్థం కోసం ప్రభుత్వ ఆశయాలకే గండి కొట్టేలా వేకెన్సీ లిస్టును తారుమారు చేసినట్లు స్పష్టమైంది. ఈ అవినీతి వ్యవహారంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పేద విద్యార్థులకు నష్టం కలిగించేలా, నగరాలకే పోస్టింగులను పరిమితం చేసే అధికారి తీరును సహించేది లేదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నర్సింగ్ కాలేజీలకు సమాన ప్రాధాన్యత దక్కాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కానీ కొందరు అధికారుల స్వార్థం వల్ల ఈ ప్రక్రియ పక్కదారి పట్టింది. అందుకే ఈ నర్సింగ్ పదోన్నతుల ఫైలును వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరోసారి క్షుణ్ణంగా సమీక్షించాలని నిర్ణయించిందని తెలుస్తోంది.

అన్ని నర్సింగ్ కాలేజీలకు ప్రిన్సిపల్స్ కావాల్సిందే

రాష్ట్రంలో 37 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలుండగా.. అందులో ఉస్మానియా, గాంధీ, సంగారెడ్డి నర్సింగ్ కాలేజీలకు మాత్రమే రెగ్యులర్ ప్రిన్సిపల్స్ ఉన్నారు. ప్రస్తుతం 32 మందికి పదోన్నతులు రాగా... వారందరినీ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలున్న నర్సింగ్ కాలేజీలకు ప్రిన్సిపల్స్ గా పంపించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ భావిస్తున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఓవైపు ప్రభుత్వం విద్యార్థులకు మేలు జరిగేలా ప్రయత్నిస్తుంటే మరోవైపు ఉన్నతాధికారులు మాత్రం తమ స్వార్థం కోసం విద్యార్థులకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని నర్సింగ్ వర్గాలు అంటున్నాయి.

Next Story