- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చదువులో ఖైదీలను ఆదర్శంగా తీసుకోవాలి..! యువతకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపు
విద్యను అభ్యసించడంలో, అవకాశాలను అందిపుచ్చుకోవడంలో గృహిణులను, మహిళలను, ఖైదీలను ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జిష్ణు దేవ్ వర్మ యువతకు పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యను అభ్యసించడంలో, అవకాశాలను అందిపుచ్చుకోవడంలో గృహిణులను, మహిళలను, ఖైదీలను ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) యువతకు పిలుపునిచ్చారు. (Ambedkar Open University) డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం మంగళవారం వర్సిటీ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతిభగల విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నప్పటికీ, చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం, డిజిటల్ లిటరసీని పెంపొందించుకోవాలని సూచించారు. డిజిటల్ విద్య, నైపుణ్య సాధికారత, ఉపాధి కల్పనలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ఆదివాసీ, గిరిజన విద్యార్థులకు ఉచిత విద్య, ట్రాన్స్ జెండర్, దివ్యాంగులకు స్కాలర్‌షిప్‌లు కల్పించడం ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న వర్సిటీ ప్రయత్నాన్ని ప్రశంసించారు.
ఉద్యోగం చేస్తూ చదువుకోవడం, గృహిణులు, సీనియర్ సిటిజన్లు, ఖైదీలకు ఈ విశ్వవిద్యాలయం ఒక గొప్ప అవకాశంగా గవర్నర్ అభివర్ణించారు. పట్టభద్రులైన 203 మంది ఖైదీలలో ఇద్దరు బంగారు పతకాలు సాధించడం వారిలో పరివర్తనకు నాంది కాగలదని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. ఉమా కాంజీలాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలకం అన్నారు. దూర, డిజిటల్ విద్య భారతదేశ విద్యా వ్యవస్థను రూపొందించడంలో కీలక శక్తిగా మారిందని, నూతన జాతీయ విద్యా విధానం 2020 కూడా దీనినే సూచిస్తోందని తెలిపారు. మూక్స్ ద్వారా ఉపాధి నైపుణ్యాలతో అంబేద్కర్ వర్సిటీ ముందడుగు వేస్తోందని ప్రశంసించారు.
గౌరవ డాక్టరేట్‌ల ప్రదానం:
ఈ స్నాతకోత్సవంలో ప్రఖ్యాత గేయ రచయిత, కవి గోరటి వెంకన్నకు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకుగాను, అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాంతి విద్యా ప్రచారకులు, రచయిత ప్రేమ్ రావత్‌లకు వారి సేవలకుగాను డాక్టర్ ఆఫ్ లెటర్స్ (గౌరవ డాక్టరేట్) లను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అందించారు.ఈ స్నాతకోత్సవంలో మొత్తం 60,288 మంది అభ్యర్థులు సర్టిఫికెట్లు పొందేందుకు అర్హత సాధించారు. ఇందులో 32,373 మంది మహిళలు ఉన్నారు. ఏడుగురు ట్రాన్స్‌జెండర్ అభ్యాసకులు తమ డిగ్రీ పట్టాలు అందుకున్నారు. మొత్తం 86 బంగారు పతకాల్లో 67 పతకాలు మహిళలు, 19 పురుషులు అందుకున్నారు. 203 మంది ఖైదీలు డిగ్రీ పూర్తి చేసుకోగా, వీరిలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చెందిన దొప్పలపూడి నాగరాజ కుమారి (పీజీ), కడప సెంట్రల్ జైలుకు చెందిన గుణకల్ యుగంధర్ (డిగ్రీ)లకు బంగారు పతకాలు లభించాయి.
గిరిజన తెగలకు ఉచిత విద్య:
యూనివర్సిటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్ల గ్రాంట్ మంజూరు చేసింది. ఎస్సీ సబ్ ప్లాన్ కింద బ్రిడ్జ్ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు రూ. 100 కోట్లు మంజూరయ్యాయి. వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి వార్షిక నివేదికను సమర్పిస్తూ, రెగ్యులర్ యూనివర్సిటీలతో సమానంగా ఒడిఎల్ లో సీబీసీఎస్ విధానం అమలు, ప్రముఖ సంస్థలతో (ఉపకారవేతనంతో కూడిన అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్) ఎంఓయూలు, వీ ఎనేబుల్ పేరుతో మహిళా సాధికారతకు కృషి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగంతో ఒప్పందం గురించి వివరించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదివాసీలైన గోండు, కోయ, చెంచు, ఇతర అభివృద్ధికి నోచుకోని గిరిజన తెగలకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు. ట్రాన్స్ జెండర్లకు, వికలాంగులకు ఇప్పటికే ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి డా. యోగితా రాణా, డీన్‌లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.






