- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉన్నత విద్యలో ఏఐ, క్వాంటం విప్లవం రావాలి.. ఓయూలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ఓయూలో 'అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్' సహకారంతో ఏర్పాటు చేసిన వైస్ ఛాన్సలర్ల సదస్సు ఘనంగా ప్రారంభమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: భారతీయ ఉన్నత విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికైంది. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో 'అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్' (ఏఐయూ) సహకారంతో ఏర్పాటు చేసిన రెండు రోజుల సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సు 2025-26 గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాల నుంచి సుమారు 100 మందికి పైగా ఉపకులపతులు హాజరైన ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీల కలయిక కేవలం శాస్త్రీయ పురోగతి మాత్రమే కాదని, నేటి విద్యా వ్యవస్థకు అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. మన విశ్వవిద్యాలయాలు కేవలం విదేశీ సాంకేతికతను వాడేవిగా ఉండకూడదని, భారతీయ నైతికత, విలువలను ప్రతిబింబించేలా స్వదేశీ ఏఐ పరిష్కారాలను రూపొందించే కేంద్రాలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీలు ఉన్నత విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచం ఇప్పుడు భౌగోళిక సరిహద్దుల శక్తి నుంచి సాంకేతిక శక్తి వైపు వేగంగా మారుతోందని, భవిష్యత్తులో దేశాల బలం వాటి సాంకేతిక సామర్థ్యం పైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ రివల్యూషన్ 5.0 దిశగా సాగుతున్నామని, ఇందులో భాగంగా ఆటోమేషన్, బిగ్ డేటా, క్రిప్టోకరెన్సీ, డ్రోన్ టెక్నాలజీలు విద్యారంగంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తున్నాయని వివరించారు.
సార్వభౌమాధికారానికి కొత్త సవాళ్లు:
సాంకేతికతకు సరిహద్దులు లేవని, ఏఐ, క్వాంటం వంటి టెక్నాలజీలు ఏ ఒక్క దేశానికో పరిమితం కాదని ప్రొఫెసర్ గుర్తు చేశారు. సైబర్ నేరాలు ఒక దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న తరుణంలో, పాత చట్టాలు ప్రస్తుత వేగానికి సరిపోవని ఆయన హెచ్చరించారు. సాంకేతికత వేగానికి అనుగుణంగా దేశాల సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ, కొత్త చట్టపరమైన చట్రాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థలకు సీఎస్ఆర్ ఎలాగైతే తప్పనిసరి అయ్యిందో, 21వ శతాబ్దపు విద్యా సంస్థలు కూడా అకడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (ఏఎస్ఆర్)ని స్వీకరించాలని ఆయన సూచించారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం మాట్లాడుతూ విద్యావేత్తలు కేవలం జ్ఞానాన్ని అందించే వారిగా కాకుండా ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్స్ గా మారాలని సూచించారు. ఓయూలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ను స్మార్ట్ సిటీలు, హెల్త్‌కేర్, రవాణా వ్యవస్థల కోసం జాతీయ స్థాయి హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు. ఈ సదస్సులో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు పాల్గొన్నాయి. పాఠ్య ప్రణాళికలో ఏఐ చేరిక, పారదర్శక పాలనలో సాంకేతికత, మేడ్ ఇన్ ఇండియా ఏఐ ఉత్పత్తుల ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది.






