కాళేశ్వరం నివేదికపై సర్కార్ తర్జనభర్జన..! విచారణ బాధ్యతలు సిట్ లేదా సీఐడీకి?

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-27 01:43:39  IST  )

కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఈనెల 30 నుంచి జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సర్కారు ప్రవేశపెట్టనున్నది.

కాళేశ్వరం నివేదికపై సర్కార్ తర్జనభర్జన..! విచారణ బాధ్యతలు సిట్ లేదా సీఐడీకి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఈనెల 30 నుంచి జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సర్కారు ప్రవేశపెట్టనున్నది. నివేదికపై సభలో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తరువాత సీఐడీ లేదా సిట్ ద్వారా విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీంతో బీఆర్ఎస్ ఇరుకున పడే ప్రమాదం ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల రిపోర్టును సభలో ప్రవేశపెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, లొసుగులను బహిర్గతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అనంతరం వీటిపై ఎలాంటి విచారణ జరిపించాలనే విషయంపై అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకోనుంది. సిట్ లేదా సీఐడీ‌కి విచారణ బాధ్యతలు అప్పగిస్తే.. ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు ఇరువురిపై కేసులు సైతం నమోదు చేసే చాన్స్ ఉంది. ఇందుకు సంబంధించి ముందుగానే న్యాయనిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఓవైపు లోకల్ బాడీ ఎన్నికల వేడి కొనసాగుతున్న సమయంలోనే గులాబీ నేతలను విచారణకు పిలుస్తారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది.

కాళేశ్వరం అంశమే ప్రధాన ప్రచార అస్త్రం

లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. కాళేశ్వరం రిపోర్టును ప్రధాన ప్రచార అస్త్రంగా మల్చుకునే అవకాశముంది. ఎక్కడికి వెళ్లినా, ఏ సభలో మాట్లాడిన సీఎం మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఇదే అంశంపై విమర్శలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. కేసీఆర్, హరీశ్ వల్లే కాళేశ్వరం కుప్పకూలిపోయిందని ఆరోపిస్తున్నారు. జస్టిస్ ఘోష్ నివేదిక వెల్లడించిన విషయాలను ఆయుధాలుగా చేసుకున్ని బీఆర్ఎస్‌పై అటాక్ చేసే అవకాశముంది. దీంతో గులాబీ పార్టీ ఇరుకున పడే చాన్స్ ఉన్నది. ఓ వైపు కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శల దాడులు, మరోవైపు విచారణ, అదే సమయంలో లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం వంటి అంశాలన్నీ గులాబీ పార్టీకి సవాల్‌గా మారనున్నాయి.

వచ్చే నెల 6 తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూలు?

వచ్చేనెల 6న జరిగే వినాయక నిమజ్జనం కోసం రాష్ట్రంలోని మెజార్టీ పోలీసు బలగాలను బందోబస్తు కోసం ఉపయోగిస్తుంటారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీలను అప్పీలు చేసే యోచనలో ఉన్నారు. ఎన్నికల హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశామని, కానీ కేంద్రం సహకరించలేదని విషయాన్ని సభకు వివరించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Next Story