- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్లపై సర్కార్ వర్కవుట్.. ఏజీతో పంచాయతీ రాజ్ అధికారుల భేటీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. దీని కోసం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నది. గురువారం అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ Aరెడ్డితో పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ సృజన, ఇతర సీనియర్ అధికారులు భేటీ అయ్యారు. లోకల్‌బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపుపై వీరు చర్చించినట్టు తెలుస్తున్నది. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ అసెంబ్లీ చేసిన చట్టాన్ని రాష్ట్రపతి ఇంత వరకు ఆమోదించలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఏం చేయాలి? సుప్రీంకోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందా? అనే అంశాలపై వారు డిస్కషన్ చేసినట్టు సమాచారం.
త్వరలో సీఎం వద్ద ఉన్నత స్థాయి సమావేశం
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై త్వరలో సీఎం రేవంత్ వద్ద ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరుగనుంది. ఇందులో లీగల్ అడ్డంకులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఆలోపే అడ్వొకేట్ జనరల్ న్యాయ సలహా ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నది. ఏజీ సుదర్శన్ రెడ్డి సైతం సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తోన్న పలువురు అడ్వొకేట్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
ఏజీ న్యాయ సలహా ప్రకారం ముందుకు
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో చట్టం చేసింది. రిజర్వేషన్ల పెంపు అంశం కేంద్ర పరిధిలో ఉండటంతో గవర్నర్ ఆ చట్టాన్ని ఢిల్లీకి పంపించారు. కానీ దానిపై కేంద్రం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చట్టాన్ని ఆమోదించడం కోసం న్యాయపరంగా ఎలాంటి పోరాటం చేయాలనే అంశంపై ఏజీ ఇచ్చే న్యాయ సలహా ప్రకారం ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సీఎం నిర్ణయం?
సెప్టెంబర్ 30వ తేదీలోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి.. పలువురు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం దగ్గరకి వెళ్లి వినతులు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని, దానికి బదులుగా లీగల్‌గా ఫైట్ చేయడమే మంచిదని ఆయన కామెంట్ చేసినట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా ఏజీ సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ ఎక్స్‌పర్ట్స్ సలహాల మేరకు సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.






