HMDAలో సమూల మార్పులకు సర్కార్ కసరత్తు.. త్వరలో జోనల్ డివిజన్ల ఏర్పాటు!

by Kema Shiva Kumar |

హెచ్ఎండీఏ పరిధి విస్తరించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకనుగుణంగా సమూల మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది.

HMDAలో సమూల మార్పులకు సర్కార్ కసరత్తు.. త్వరలో జోనల్ డివిజన్ల ఏర్పాటు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ పరిధి విస్తరించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకనుగుణంగా సమూల మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది. భవన నిర్మాణ అనుమతులు, ఇంజినీరింగ్ విభాగం పనుల మంజూరు, ప్లానింగ్ అంశాలు, పరిపాలనా పరమైన అంశాల్లో మార్పులతో పాటు అధికార వికేంద్రీకరణ సైతం చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. వీటితో పాటు టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు డిజిటల్ గవర్నెన్స్ వంటి కొత్త విభాగాలను సైతం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. హెచ్ఎండీఏ ఆర్గనైజేషనల్ నిర్మాణం ఎలా ఉండాలి? ఎన్ని డివిజనల్ జోన్లు ఉండాలి? అనే అంశాల ఆధారంగా ప్రతిపాదనలు రూపొందించేందుకు కన్సల్టెన్సీ నియమించుకోవాలని నిర్ణయించింది. అందుకోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. బిడ్ దాఖలు చేసేందుకు ఈనెల 15వ తేదీ వరకు అవకాశం ఉంది.

హెచ్ఎండీఏ పరిధి ఇలా..

హెచ్ఎండీఏ పరిధిని 10,472.72 చదరపు కిలో మీటర్లకు పెంచారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి దీని పరిధిలో ఉన్నాయి. కొత్తగా నల్లగొండ, వికారాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాలనూ చేర్చారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1,355 రెవెన్యూ గ్రామాల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 533 గ్రామాలు, అత్యల్పంగా నాగర్ కర్నూల్ జిల్లాలో మూడు గ్రామాలు ఉన్నాయి. రంగారెడ్డి 533, మేడ్చల్-మల్కాజిగిరి 163, యాదాద్రి-భువనగిరి162, సంగారెడ్డి 151, మెదక్ 101, సిద్దిపేట 74, హైదరాబాద్ 64, వికారాబాద్ 31, మహబుబ్‌నగర్ 19, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మూడు గ్రామాలున్నాయి.

ఆర్గనైజేషనల్ నిర్మాణం, అధికార వికేంద్రీకరణ

హెచ్ఎండీఏ ఆర్గనైజేషనల్ నిర్మాణం, పరిపాలనపరమైన అంశాలు, అధికారాలు, అధికార వికేంద్రీకరణ, ఇంటర్ డిపార్ట్‌మెంటల్ వ్యవహారాలు, విధాన పరమైన అంశాలు, హెచ్ఓడీలకు ఉండాల్సిన అధికారాలు, ఫైల్స్ అప్రోవల్ ప్రాసెస్ వంటి అంశాల్లో సమూల మార్పులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే దేశంలోని వివిధ మెట్రోపాలిటన్ అథారిటీల నిర్మాణం, అమలు చేస్తున్న ఈ-గవర్నెన్స్, అధికార వికేంద్రీకరణ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వంటి విధానాలను సైతం అధ్యయనం చేయాలని డిసైడ్ చేశారు. ప్రస్తుతం అధికారులకు ఉన్న పవర్స్, కొత్తగా ఇవ్వాల్సిన అధికారాలను పరిశీలించనున్నారు.

స్టేక్ హోల్డర్లతో చర్చలు

హెచ్ఎండీఏలో చేయనున్న మార్పులు, చేర్పులను హెచ్ఎండీఏ అధికారులు, హెచ్ఓడీలు, అధికారులు, ఉద్యోగులు, అర్బన్ ప్లానర్స్, ఎన్జీఓ, ఇతర శాఖల అధికారులతో చర్చించేందుకు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా అర్బన్ ప్లానింగ్, బిల్డింగ్స్ పర్మిషన్స్, భూసేకరణ, ల్యాండ్ లీజింగ్, అలాట్‌మెంట్, మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులు, ఫైనాన్స్, హెచ్ఆర్, పరిపాలన వ్యవహారాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉండాలి? అనే అంశాలపై అభిప్రాయాలు సేకరించనున్నారు.

కో-ఆర్డినేషన్ కోసం పీఎంయూ

హెచ్ఎండీఏ పరిధిలో ప్లానింగ్, అభివృద్ధి పనులు చేపట్టేందుకు మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, టీజీఐఐసీ, జలమండలి, టీజీఎస్ఆర్టీసీ, స్థానిక సంస్థలతో కలిసి పని చేసేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్ డిపార్టెమెంటల్ అంశాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టేషన్ హబ్స్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్, యూనిఫైడ్ బిల్డింగ్ అండ్ డెవలప్‌మెంట్ కోడ్, మాస్టర్ ప్లాన్-2050 వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లేందుకు పీఎంయూ చర్యలు తీసుకుంటుంది.

జోనల్ డివిజన్ల ఏర్పాటు

హెచ్ఎండీఏ పరిధిలో పరిపాలన, ప్లానింగ్, ఇంజినీరింగ్, అర్బన్ ఫారెస్ట్రీ, ఇతర అంశాలను సమన్వయం చేసేందుకు జోనల్ డివిజన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని సమన్వయం చేసేందుకు జోనల్ కమిషనర్లను నియమించనున్నారు. ప్రతి అంశాన్నీ జోనల్ పరిధిలోనే జరిగేలా రూపొందించనున్నారు.

కొత్త విభాగాలు

హెచ్ఎండీఏ పరిధిలో ప్లానింగ్, డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్ పనులు, ఇతర అంశాల్లో రియల్‌ టైం అర్బన్ మేనేజ్‌మెంట్ కోసం డిజిటల్ ట్విన్ టెక్నాలజీతో ఇంటిగ్రేషన్ చేయనున్నారు. దీంతో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే హెచ్ఎండీఏలో కొత్తగా డిజిటల్ గవర్నెన్స్-జీఐఎస్, అర్బన్ మొబిలిటీ-ట్రాన్సిస్ట్ ఇంటిగ్రేషన్, వాతావరణ మార్పులు, ప్రజాఫిర్యాదులు తగ్గించేందుకు ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

బిడ్ దాఖలు.. ఏజెన్సీతో అగ్రిమెంట్

జోనింగ్ విధానం, అధికార వికేంద్రీకరణ వంటి అంశాల ఆధారంగా ప్రతిపాదనల కోసం హెచ్ఎండీఏ రిక్వెస్ట్ ఫర్ ప్రపొజల్ పిలిచింది. దీంతో మూడు ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు అందజేశారు. ఏజెన్సీలతో అధికారులు ప్రీ బిడ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కన్సల్టెన్సీ నియామకానికి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుంచి బిడ్ దాఖలు చేసేందుకు 15వ తేదీ వరకు గడువు విధించింది. టెక్నికల్ బిడ్ సైతం అదే రోజు ఓపెన్ చేయనున్నారు. 23న ఫైనాన్సియల్ బిడ్ ఓపెన్ చేయడంతో పాటు 24న టెండర్ దక్కించుకున్న ఏజెన్సీతో హెచ్ఎండీఏ అగ్రిమెంట్ చేసుకోనుంది.

జనవరి 2026 నుంచే..

హెచ్ఎండీఏ కొత్తగా ఏర్పాటు చేయనున్న జోనల్ డివిజన్లు, అధికార వికేంద్రీకరణ, కొత్త విభాగాల ఏర్పాటు జనవరి 2026 నుంచే అమల్లోకి రానున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 24న ఏజెన్సీతో అగ్రిమెంట్ చేసుకుంటే డిసెంబర్ చివరి నాటికి అన్ని అంశాలను రూపొందించే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Next Story