Aadi Srinivas: భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Aadi Srinivas: భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన రెండు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఫలితాలే ఈ అపవిత్ర కలయికకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేశాయని ఆది శ్రీనివాస్ విమర్శించారు. "ఇబ్రహీంపట్నంలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఇరు పార్టీలు పంచుకున్నాయి. తాజాగా జరిగిన ఖానాపూర్ ఎన్నికల్లో కూడా ఇదే దోస్తీ పునరావృతమైంది. అక్కడ బీజేపీకి చైర్మన్ సీటు ఇచ్చి, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ పదవిని తీసుకుంది. ప్రజల ముందు విమర్శలు చేసుకుంటూ, లోపల మాత్రం పదవులు పంచుకోవడం సిగ్గుచేటు" అని ఆయన మండిపడ్డారు.

నాయకుల ద్వంద్వ నీతిపై ప్రశ్నలు..

బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవని చెబుతున్నారని, మరి ఖానాపూర్, ఇబ్రహీంపట్నంలలో జరిగింది పొత్తు కాదా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే, గతంలో మాకు ఎవరితోనూ సంబంధం లేదని ప్రగల్భాలు పలికిన కేటీఆర్, ఇప్పుడు ఈ అనైతిక పొత్తులపై ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్నది విడదీయలేని 'ఫెవికాల్ బంధం' అని ఆది శ్రీనివాస్ అభివర్ణించారు. గతంలోనూ ఈ రెండు పార్టీలు కలిసి పనిచేశాయని, ఇప్పుడు చేస్తున్నాయని, భవిష్యత్తులో కూడా కలిసే పోటీ చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు. కేటీఆర్, రామచంద్రరావు ఈ కుమ్మక్కు రాజకీయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story