Building Rules : త్వరలో యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్.. నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండీఏ

by Javid Pasha |

యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్ రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలు, ఇన్ఫ్రా కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది.

Building Rules : త్వరలో యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్.. నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండీఏ
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, అర్బన్ డెవలప్ మెంట్ ఆథారిటీలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు సంబంధించిన నిబంధనలు ఒకే విధంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకుగాను యూనిఫైడ్ బిల్డింగ్స్ రూల్స్ రూపొందించేందుకు హెచ్ఎండీఏను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే కన్సల్టెన్సీ కోసం హెచ్ఎండీఏ ఆహ్వానించిన టెండర్ ను ‘ఈ అండ్ వై’ అనే సంస్థ దక్కించుకున్నది. ఈ సంస్థకు ఇంతకుముందు గుజరాత్, మహారాష్ట్రల్లో యూనిఫైడ్ రూల్స్ తయారు చేసిన అనుభవం ఉన్నది. దీంతోపాటు అనేక అంతర్జాతీయ నగరాల్లోనూ బిల్డింగ్ రూల్స్ రూపొందించింది. అయితే రాష్ట్రంలో బిల్డింగ్స్ రూల్స్, ఇతర మార్గదర్శకాలను అన్నింటిని కలిపి యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్ రూపకల్పనకు సంబంధించిన పనులను ‘ఈ అండ్ వై’ సంస్థ రూపొందించనుంది.

స్టేక్ హోల్డర్లతో సమావేశం

యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్ రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలు, ఇన్ఫ్రా కంపెనీలతో వచ్చేనెల రెండో వారంలో సమావేశం ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలను తీసుకోవడంతోపాటు ‘ఈ అండ్ వై’ ప్రతినిధులు సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ అనుభవాలను వివరించనున్నారు. ఈ సమావేశానికి టీజీఐఐసీ, పంచాయతీరాజ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ), అగ్నిమాపక శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్డు, భవనాల శాఖ, విద్యుత్ శాఖ, రక్షణ శాఖ, రైల్వేశాఖ, ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), జలమండలి వంటి శాఖలకు సంబంధించిన అధికారులు సైతం హాజరుకానున్నారు. వీరితోపాటు నిర్మాణ రంగంలోని నిపుణులు, ఇంజినీర్లు, ఆర్కిటెక్చర్లు, బిల్డర్లు, డెవలపర్లు, ఇంజినీరింగ్ అసోసియేషన్లు, రిటైర్డ్ ప్లానింగ్ ప్రొఫెసర్లు, వంటి వారి నుంచి వీలైనంత ఎక్కువగా సలహాలు, సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story