ఫుడ్ సేఫ్టీ-డ్రగ్ కంట్రోల్ విలీనానికి ప్రభుత్వం కీలక అడుగు: మంత్రి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

ప్రజారోగ్య పరిరక్షణను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది.

ఫుడ్ సేఫ్టీ-డ్రగ్ కంట్రోల్ విలీనానికి ప్రభుత్వం కీలక అడుగు: మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజారోగ్య పరిరక్షణను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ప్రస్తుతం వేర్వేరుగా పనిచేస్తున్న ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) విభాగాలను విలీనం (ఇంటిగ్రేట్) చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి అనువైన రీతిలో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను (యాక్షన్ ప్లాన్) సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తును ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. బుధవారం సచివాలయంలో రెండు విభాగాల బలోపేతంపై ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన ఆహారం, సురక్షితమైన ఔషధాలను అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఆహార భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

విలీనంతో వేగవంతం కానున్న ఎన్‌ఫోర్స్‌మెంట్

రెండు విభాగాలు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నప్పటికీ, విడివిడిగా ఉండటం వల్ల సమన్వయం లోపిస్తోందని అధికారులు మంత్రికి వివరించారు. సిబ్బంది కొరత, తనిఖీల్లో ఇబ్బందులు, ల్యాబ్ సామర్థ్యం పెంపు, చట్టపరమైన చర్యల ఆలస్యం వంటి సవాళ్లను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా తనిఖీలు, శాంపిల్ సేకరణ, ల్యాబ్ పరీక్షలు, ఇంటెలిజెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, చట్టపరమైన చర్యలు మరింత వేగంగా, సమర్థవంతంగా చేపట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పరిపాలనా, చట్టపరమైన, సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి విలీనానికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను పెంచేందుకు, నిపుణుల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని ఫుడ్ టెస్టింగ్ ల్యాబులను ఆధునీకరించడంతో పాటు అవసరమైన చోట రీజనల్ ల్యాబుల ఏర్పాటును పరిశీలించాలన్నారు. ఆధునిక పరీక్షా పరికరాలు, సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచాలని స్పష్టం చేశారు.

తప్పు చేస్తే కఠిన శిక్షే.. కానీ ఇండస్ట్రీకి ఇబ్బంది వద్దు

కల్తీ ఆహారం, నాసిరకం, నకిలీ మెడిసిన్స్ తయారీ, నిల్వ, విక్రయాలపై కఠినంగా వ్యవహరించేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడే వరకు డిపార్ట్‌మెంట్ యాక్షన్ కొనసాగాలని, అందుకోసం బలమైన లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అదే సమయంలో ఫుడ్ ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే హోటళ్లు, రెస్టారెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేశారు. ఫార్మా, వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్‌ ప్రపంచ ప్రసిద్ధి గాంచిందని గుర్తు చేసిన మంత్రి, ఈ బ్రాండ్‌ను మరింత విస్తరించే విధంగా గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్‌ను (జీఎంపీ) ప్రోత్సహించాలని డీసీఏ డీజీ అవినాష్ మహంతికి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ, డీసీఏ డీజీ అవినాష్ మహంతి, ఆరోగ్యశ్రీ సీఈవో హనుమంతు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story