సీఎంఆర్ఎఫ్‌‌పై సర్కార్ కీలక నిర్ణయం.. అమాత్యులకు ‘పవర్స్ కట్’

by Kema Shiva Kumar |

తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ (CMRF) పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది.

సీఎంఆర్ఎఫ్‌‌పై సర్కార్ కీలక నిర్ణయం.. అమాత్యులకు ‘పవర్స్ కట్’
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎంఆర్ఎఫ్ అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి సహాయనిధి అమలులో మంత్రుల పాత్రను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు మంత్రులు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ సిఫార్సులు ఇచ్చేవారు. కానీ.. ఇక నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికే పరిమితం చేసింది. తమ నియోజకవర్గానికి చెందిన చిరునామా ఉన్న అభ్యర్థులకు మాత్రమే సీఎంఆర్ఎఫ్ టోకెన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరించనున్నారు. దరఖాస్తుదారు తమ వివరాలు, అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి. చెక్కుల జారీ, రీవాలిడేషన్ ప్రక్రియ సైతం ఆన్‌లైన్ లోనే జరగనుంది. అందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇంతకుముందు సీఎంఆర్ఎఫ్ చెక్కులో మార్పులు అవసరమైతే మ్యానువల్ విధానం ఉండేది. ప్రస్తుతం ఆ ప్రక్రియను మార్చి సీఎంఆర్ఎఫ్ చెక్ రీ వాలిడేషన్ ప్రాసెస్‌ను ప్రజాప్రతినిధుల లాగిన్‌లో చేర్చారు.

మధ్యవర్తులకు చెక్..

సీఎంఆర్ఎఫ్ చెక్కులో మార్పులు కోరుకునే వారు ఇక నుంచి సంబంధిత ప్రజాప్రతినిధి కార్యాలయానికి వెళ్లి ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాప్రతినిధి కార్యాలయ సిబ్బంది అసలు దరఖాస్తును సెక్రెటేరియట్‌లోని సీఎంఆర్ఎఫ్ విభాగానికి పంపించాలి. కొత్త చెక్కు సంబంధిత ప్రజాప్రతినిధి కార్యాలయ సిబ్బందికే అందిస్తారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెంపు లక్ష్యంగా పెట్టుకున్నది. అలాగే.. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే చెక్కులు జారీచేయనున్నారు. అవసరమైన వివరాలు, పత్రాలు సరిచూసిన తర్వాతే చెల్లింపులు జరుగుతాయి. ఇక గడువు ముగిసిన చెక్కుల రీవాలిడేషన్ సైతం ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. గతంలో నకిలీ మెడికల్ బిల్లులు, మధ్యవర్తుల ద్వారా జరిగిన దుర్వినియోగం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. భవిష్యత్ లో ప్రజలు నేరుగా అధికారిక మార్గాల ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని సూచించింది. దరఖాస్తులకు ఎమ్మెల్యేలు లేదా అధికార ప్రతినిధుల సిఫార్సు తప్పనిసరి. ప్రతి దరఖాస్తును వైద్య నిపుణుల బృందం పరిశీలించిన తర్వాతే ఆమోదం ఇవ్వనున్నారు. దరఖాస్తుదారులు సరైన పత్రాలు సమర్పించి అధికారిక మార్గాలను మాత్రమే ఆశ్రయించాలని సూచించారు.

Next Story