పసుపు రైతులకు ప్రభుత్వ అండ.. మంత్రి తుమ్మల కీలక భరోసా

by Ramesh Naini |

రాష్ట్రంలో అకాల వర్షాలకు నష్టపోయిన పసుపు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

పసుపు రైతులకు ప్రభుత్వ అండ.. మంత్రి తుమ్మల కీలక భరోసా
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అకాల వర్షాలకు నష్టపోయిన పసుపు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తేమకు గురైన పసుపును కూడా ఎటువంటి కోతలు లేకుండా పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా పసుపు రాక కొనసాగుతోంది. ఈనెల 30వ తేదీ వరకు సుమారు 4500 పసుపు కుప్పలు మార్కెట్ యార్డుకు చేరుకున్నాయి. వీటిలో ఎక్కువ భాగాన్ని పైకప్పు ఉన్న షెడ్లలో భద్రపరచగా, సుమారు 500 కుప్పలు బహిరంగ ప్రదేశాల్లో నిల్వ చేయబడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న పసుపును రక్షించేందుకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 1500 టార్పాలిన్‌ల పంపిణీకి బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయింది. అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

తడిసిన పసుపు కోతలు లేకుండా కొనుగోలు

ఇటీవల సంభవించిన బలమైన గాలులు, వర్షాల ప్రభావంతో సుమారు 35 నుంచి 40 మంది రైతులకు చెందిన 70 నుంచి 80 పసుపు కుప్పలు తేమకు గురయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తడిసిన పసుపును కూడా ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. మేలురకం పసుపుకు ప్రభుత్వం ఖరారు చేసిన ధరల ప్రకారం రైతులకు చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తేమ శాతం, కోతల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేసే మార్కెట్ యార్డు అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మార్కెట్ యార్డు సెక్రటరీలు, డైరెక్టర్, సంబంధిత అధికారులకు ఆదేశించారు.

నానో యూరియా వినియోగం..

రాష్ట్ర వ్యాప్తంగా రైతులను నూతన సాంకేతికతలు, ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించేందుకు నిర్వహించిన ‘రైతు నేస్తం’ 88 వ ఎపిసోడ్ విజయవంతంగా జరిగింది. రాష్ట్రంలోని సుమారు 1600 రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యంతో రైతులు, వ్యవసాయ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలువురు రైతులు తమ సాగు అనుభవాలను పంచుకోగా యాదాద్రి జిల్లాకు చెందిన సందీప్ ప్రకృతి వ్యవసాయం, స్వీయ మార్కెటింగ్ పద్ధతులపై వివరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మహేంద్ర రెడ్డి వరి సాగులో నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు నవీన్ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై తన అనుభవాలను పంచుకుని ఇతర రైతులకు స్ఫూర్తినిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బాబురావు ప్రకృతి వ్యవసాయంలో తన అనుభవాలను వివరించారు. జగిత్యాల జిల్లా గూడూరు మరియు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సమగ్ర సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న యువ రైతు సందీప్‌ను, నానో యూరియా వినియోగంలో ముందున్న మహేంద్ర రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ స్థాయిలో ప్రకృతి వ్యవసాయం, నానో యూరియా వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. యూరియా అధిక వినియోగంతో కలిగే నష్టాలను వివరించడంతో పాటు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ద్వారా సాగు విస్తీర్ణానికి అనుగుణంగా అవసరమైన యూరియా మోతాదును రైతులు సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గిస్తూ, నానో యూరియా, నానో డీ.ఏ.పీ వినియోగం ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు.

Next Story