‘ఇంటర్’ విద్య బలోపేతానికి సర్కార్ అడుగులు.. ఇక కళాశాలలు CCSకు అనుసంధానం

by Kema Shiva Kumar |

ఇంటర్ విద్య బలోపేతానికి, విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ఇంటర్ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది.

‘ఇంటర్’ విద్య బలోపేతానికి సర్కార్ అడుగులు.. ఇక కళాశాలలు CCSకు అనుసంధానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ విద్య బలోపేతానికి, విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ఇంటర్ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, విద్యా ప్రమాణాలు పెంచాలని సూచించిన నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు, వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో, ఇంటర్మీడియట్ కమాండ్ కంట్రోల్ రూమ్ (సీసీఆర్) ద్వారా రాష్ట్రంలోని ప్రతి కళాశాలను అనుసంధానం చేస్తూ క్షేత్రస్థాయి తనిఖీలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ గత నెల 23న అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రారంభించారు. గైర్హాజరైన విద్యార్థి వివరాలు వెంటనే వారి తల్లిదండ్రులకు వాట్సాప్‌ వెళతాయని అధికారులు తెలిపారు.

కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ

రాష్ట్రవ్యాప్తంగా 430 ప్రభుత్వ కాలేజీలుండగా, అందులో సుమారుగా 6 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీటీవీ కెమెరాలను నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తారు. దీని ద్వారా, క్షేత్రస్థాయిలో జరిగే తనిఖీలను మరింత పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించవచ్చంటున్నారు.

అనధికార గైర్హాజరుకు చెక్

ఇంటర్ విద్యాశాఖ పరిధిలో బోధన, భోధనేతర సిబ్బంది, ఇతర ఉద్యోగులు, అధికారులు మొత్తంగా సుమారు 8 వేల మంది పనిచేస్తున్నారు. వారి సెలవుల మంజూరు కోసం హెచ్‌ఆర్‌ఎంఎస్‌ (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్) పోర్టల్‌ను సెప్టెంబర్ మొదటి వారంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ నెలాఖరుకు మొత్తం 10 సేవలను ఆన్ లైన్ ద్వారా పొందేలా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. పూర్తిస్థాయి డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తున్న ఇంటర్ విద్యాశాఖ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూనే, పాలనాపరమైన సంస్కరణలను కూడా విజయవంతంగా చేపడుతోంది.

Next Story