రబీకి సరిపడ యూరియా సరఫరాకు ప్రభుత్వం చర్యలు

by Muthe.Rajitha |

రబీ సీజన్‌లో రాష్ట్రంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో యూరియా వినియోగం అత్యధికంగా ఉండే అవకాశం ఉందని, ఆ సమయంలో రైతులకు సరిపడ ఎరువుల సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

రబీకి సరిపడ యూరియా సరఫరాకు ప్రభుత్వం చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రబీ సీజన్‌లో రాష్ట్రంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో యూరియా వినియోగం అత్యధికంగా ఉండే అవకాశం ఉందని, ఆ సమయంలో రైతులకు సరిపడ ఎరువుల సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, డిమాండ్‌ను తట్టుకునేలా బఫర్ నిల్వలను అందుబాటులో ఉంచడానికి, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎరువులలో అక్టోబర్ నుండి డిసెంబర్ నెల వరకు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియాను అందించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 2.48 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని, ఈ నిల్వలను డిసెంబర్ ఆఖరికి ఇంకా ఎక్కువ మొత్తం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. కేంద్ర ఎరువుల శాఖ ద్వారా డిసెంబర్ నెలకు రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో 86 వేల మెట్రిక్ టన్నులు ఇప్పటికే కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం, తుత్తుకుడి, గంగవరం, కారైకాల్, జైగఢ్ వంటి పోర్టులకు చేరిందని వెల్లడించారు. ఈ నిల్వలను త్వరితగతిన రాష్ట్రానికి తరలించడం అత్యవసరమని, యూరియా రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ , కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కు ప్రత్యేకంగా లేఖల ద్వారా అభ్యర్థించారు.

యూరియా రవాణాకు అవసరమైన ఖాళీ రైల్వే రేకులను తక్షణమే కేటాయించడం, పోర్టుల వద్ద క్లియరెన్స్ మరియు హ్యాండ్లింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడం, యూరియా రవాణాకు ఇతర సరుకుల కంటే మొదటి ప్రాధాన్యం ఇవ్వడం, పోర్టు అధికారులు, షిప్పింగ్ లైన్లు, హ్యాండ్లింగ్ ఏజెన్సీలు, రైల్వే అధికారుల మధ్య సమన్వయం పెంచి రవాణాలో ఆలస్యాలను నివారించడం వంటి అంశాలను లేఖల ద్వారా కేంద్ర మంత్రులను కోరినట్లు పేర్కొన్నారు.

ఈ రవాణా ప్రక్రియను పర్యవేక్షించేందుకు, రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులను కూడా పోర్టులకు పంపి, సంబంధిత అధికారులతో సంప్రదించాలని ఆదేశించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంటున్నదని వెల్లడించారు.

Next Story