- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయని సాగు ఆలస్యమైనందున మరో 13 జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదన్నారు. శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక ధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో ఈ సీజన్ లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఇప్పటి వరకు 5 వేల కేంద్రాలు అందుబాటులోకి తెచ్చి 4.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వకు 12 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసేలా గోదాములు గుర్తించామని, మరో 20 లక్షల బాయిల్డ్ రైస్ ను నిలువ ఉంచేందుకు జిల్లాల వారీగా కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో 16 కోట్ల గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ధాన్యం తేమను త్వరితగతిన కొలిచేందుకు వీలుగా ప్యాడి క్లీనర్లు, డ్రైయర్లు ఏర్పాటు చేసినట్లు, ఆలస్యం జరగకుండా చూసేందుకు సరిపడా హమాలీలను నియమించినట్లు చెప్పారు. తూకంలో పొరపాట్లు జరగకుండా ధాన్యాన్ని ఆయా ప్రాంతంలో ఉన్న మిల్లులకు తరలించేందుకు రవాణా ఏర్పాట్లను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. పొరుగు రాష్ట్రాల నుండి అక్రమంగా ధాన్యం తరలి రాకుండా ఉండేలా అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిఘా పెట్టినట్లు తెలిపారు. రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగేలా పౌర సరఫరాలశాఖా మార్కెటింగ్ శాఖలతో పాటు జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.






