- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు డిమాండ్లు తప్ప చర్చలకు సిద్ధం: ఆర్టీసీ సమ్మెపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు తన పరిధిలో లేవని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు తన పరిధిలో లేవని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. (RTC strike) ఆర్టీసీ సమ్మె అంశంపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విలీనం అంశం కమిటీ దగ్గర ఉందని, సమ్మె విషయంలో రెండు సమస్యలపై మినహా మిగతా అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ - అలైవ్ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ సోమవారం అధికారులతో కలిసి మంత్రి విడుదల చేశారు. అనంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బందికి సంబంధించిన అంశాలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రేరేపిత సమ్మెలకు వెళ్ళవద్దని ఆర్టీసీ కార్మికులను కోరుతున్నామన్నారు. పెండింగ్ డీఏ ఇచ్చామని.. పీఆర్సీపై ఆలోచన చేస్తున్నామని అన్నారు.
18వ తేదీ వరకు అరైవ్- అలైవ్..
ఈ నెల 13 వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రోడ్ సేఫ్టీ కోసం పోలీస్, రవాణా శాఖ కలిసి అరైవ్- అలైవ్ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి తెలిపారు. రవాణా నిబంధనలు, ప్రమాదాలకు కారణాలు చర్చించి, వాటిని తగ్గించే చర్యలు తీసుకోవడానికి కార్యక్రమం చేపట్టామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం రవాణా శాఖ చర్యలు తీసుకుంటుందని ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 6 రోజుల్లో అన్ని జిల్లాల్లో శాఖ పరంగా సమీక్షలు చేసుకుంటామని చెప్పారు. ప్రమాదాల నివారణ, ప్రాణ నష్టం లేకుండా చూడటమే కార్యక్రమం లక్ష్యం అని తెలిపారు. యాక్సిడెంట్ అయిన గంటలో (గోల్డెన్ అవర్) క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పిస్తే రహవీర్ అవార్డ్ తో సత్కరిస్తున్నామన్నారు. చెక్ పోస్టులు ఎత్తివేసి సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. అన్ని స్కూళ్లలో విద్యార్థులకు రవాణా నిబంధనలు వివరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీలో 30 ఏళ్ల సర్వీసులో ఉండి, ఒక్క యాక్సిడెంట్ కూడా చేయని వారికి సన్మానం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్ సేఫ్టీ సమావేశాలు ప్రతి జిల్లాలో నిర్వహించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, రమేష్, శివ లింగయ్య తదితరులున్నారు.






