- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐటీ రంగం అభివృద్ధిలో ప్రభుత్వం కీలకపాత్ర
తెలంగాణలో ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) / ఐటీ-ఐటీఈఎస్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) / ఐటీ-ఐటీఈఎస్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. శుక్రవారం మాసబ్ ట్యాంకులోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కార్యాలయంలో ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఐటీ రంగ అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్‌కు పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను అందించాలన్న సీఎం ఆశయాన్ని ఆయన ప్రస్తావించారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌లుగా మార్చడం ద్వారా విద్యార్థులందరికీ వంద శాతం ఉద్యోగాలు లభిస్తాయని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను భారతదేశానికి నైపుణ్య రాజధానిగా మార్చాలని ఆయన ఆకాంక్షించారు. పరిశ్రమ, విద్యా సంస్థల సహకారం, మార్కెట్ డిమాండ్ నైపుణ్యాలను అందించడం, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను కల్పించడం వంటి అంశాల ప్రాముఖ్యతలను ఈ సమావేశంలో మంత్రి వివరించారు.
నైపుణ్యాలు మెరుగుపరిచేలా:
ఇందులో ప్రధానంగా ఒప్పందం ద్వారా ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ విద్యార్థులు, టీజీసీహెచ్ఈ పరిధిలోని యూనివర్శిటీలు, కాలేజీలు, సంస్థల అధ్యాపకులకు ఎమర్జింగ్ టెక్నాలజీలలో నైపుణ్యాలను మెరుగుపరచడానికి శిక్షణా కార్యక్రమాలను అమలు చేయనున్నారు. మైక్రో-లెర్నింగ్ కంటెంట్, ఫౌండేషన్, డీప్-స్కిల్లింగ్ కోర్సులతో పాటు ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అండ్ టెస్టింగ్ లో ప్రత్యేకమైన ఆఫ్‌లైన్ కోర్సులను అందించనున్నారు. నాస్కామ్ తెలంగాణ రాష్ట్రంలో మూడు సంవత్సరాల కాలంలో ఏటా ఒక లక్ష మంది అభ్యాసకులకు నైపుణ్యాన్ని పెంపొందించనుంది. తద్వారా కోర్సులు పూర్తి చేసిన వారికి ఎస్ఎస్ సీ నాస్కామ్ టాలెంట్ కనెక్ట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఉన్నత విద్యను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చడానికి, డిజిటల్ మార్కెటింగ్, సైబర్‌సెక్యూరిటీ, ఫిన్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సస్టైనబుల్ సైన్సెస్ వంటి కొత్త డొమైన్‌లలో సాంకేతిక-ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతోంది.
నాస్కామ్ ఐటీ-ఐటీఈఎస్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ సీఈఓ డా. అభిలాష గౌర్ మాట్లాడుతూ, భారతదేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి నాస్కామ్ చేసిన కృషిని తెలియజేశారు. ఈ రంగంలో నైపుణ్య అభివృద్ధిని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలను ఆమె వివరించారు. టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి మాట్లాడుతూ, ఉన్నత విద్యను పరిశ్రమ డిమాండ్‌లకు అనుగుణంగా మార్చడానికి ఉన్నత విద్యా మండలి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో చేపట్టిన సమగ్ర పాఠ్య ప్రణాళిక సంస్కరణలను వివరించారు. తద్వారా ప్రతి విద్యార్థి డిజిటల్ మార్కెటింగ్, సైబర్‌సెక్యూరిటీ, ఫిన్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సస్టైనబుల్ సైన్సెస్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో సాంకేతిక ఆధారిత కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రాడ్యుయేట్ల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ లు పురుషోత్తం, ఎస్.కె మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, యూనివర్శిటీల ఉపకులపతులు తదితరులు పాల్గొన్నారు.






