బోగస్ పెన్షన్లపై సర్కార్ సర్జికల్ స్ట్రైక్.. రంగంలోకి 'ఫోరెన్సిక్ ఆడిట్'!

by Kema Shiva Kumar |

తెలంగాణ ఆసరా పెన్షన్లలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు.

బోగస్ పెన్షన్లపై సర్కార్ సర్జికల్ స్ట్రైక్.. రంగంలోకి ఫోరెన్సిక్ ఆడిట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆసరా పెన్షన్ స్కీమ్ అమలులో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించినట్లు తెలిసింది. రెండు మూడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తులు, పలు ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ సైతం పెన్షన్లు తీసుకుంటున్నారని ఆధారాలు లభించినట్లు సమాచారం. దీంతో ఆసరాలో నిజమైన లబ్ధిదారులు ఎంతమంది? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని కోసం అన్ని జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

పెద్ద ఎత్తున ఫిర్యాదులు

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం లోకల్ లీడర్ల సిఫారసుల మేరకు పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో వచ్చిన అప్లికేషన్లు స్క్రూట్నీ చేయకుండా అర్హులకు ఇస్తున్నామా? లేదా? అని క్రాస్ చెక్ చేయకుండా మంజూరు చేసినట్టు చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని, చనిపోయిన వ్యక్తులకు సైతం పెన్షన్ ఇస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం అర్బన్ ఏరియాలో ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలంటూ సెర్ప్ అధికారులను ఆదేశించింది. అందుకోసం కొన్ని ప్రత్యేక టీమ్స్‌ను ఎంపిక చేసిన పట్టణాలు, నగరాలకు పంపింది. తమ వద్ద ఉన్న లబ్ధిదారుల అడ్రస్‌లను వెతుక్కుంటూ వెళ్లిన టీమ్స్‌కు ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలిశాయి.

అర్బన్ ఏరియాల్లోనే అక్రమాలు అధికం..

పెన్షన్ స్కీమ్ అమలులో ఆర్బన్ ఏరియాల్లోనే పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. స్కీమ్ అమలు నుంచి పట్టణ, నగరాల్లోని లబ్ధిదారుల ఫిజికల్ అటెండెన్స్ తీసుకోవడం లేదు. తమ వద్ద ఉన్న జాబితా మేరకు లబ్ధిదారుల అకౌంట్స్‌లో డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఏ విధంగా ఉంటారు? ఎక్కడ ఉంటారు? అసలు బతికి ఉన్నారా? లేదా? అనే విషయాలు అధికార యంత్రాంగానికి తెలిసే అవకాశం లేదు. అదే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రతి ఆసరా పెన్షన్ దారుడు తప్పనిసరిగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దకు వెళ్లాలి. థంబ్ ఇంప్రెషన్, ఐరిష్, ఫేషియల్ రికగ్నైజేషన్‌లో ఏదో ఒక అటెండెన్స్ ఇవ్వాలి. అర్బన్ ఏరియాల్లో ఫిజికల్ అటెండెన్స్ తీసుకునే మెకానిజం లేకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

చనిపోయిన వ్యక్తుల అకౌంట్స్ యాక్టివ్

నగరానికి దగ్గరలో ఉన్న ఓ మున్సిపాలిటీలో ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ఓ టీమ్ ఫీల్డ్‌కు వెళ్లింది. ఆ మున్సిపాలిటీలో ఉన్న 10 వార్డుల్లో ఓ నాలుగు వార్డులను ఎంపిక చేసుకున్నది. ఆ నాలుగు వార్డుల్లో మొత్తం 590 మంది ఆసరా బెనిఫిషియరీస్‌గా ఉండగా, కేవలం 360 మందిని మాత్రమే గుర్తించారు. అందులో 36 మంది చనిపోయినా.. రెండు, మూడేళ్లుగా వారి అకౌంట్స్‌లోకి నగదు బదిలీ అవుతున్నది. ప్రతి నెలా ఆ సొమ్మును ఏటీఎం ద్వారా డ్రా చేస్తున్నట్లు సెర్ప్ అధికారులు గుర్తించారు. ఈ పని ఎవరు చేస్తున్నారు? చనిపోయిన వ్యక్తుల సంబంధీకులు వచ్చి డ్రా చేస్తున్నారా? లేకపోతే స్థానికంగా పని చేస్తున్న అధికారులే సొమ్మును కొల్లగొడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకరికే రెండు పెన్షన్లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెన్షన్ లబ్ధిదారుల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో జీహెచ్ఎంసీ‌లో పనిచేస్తున్న స్టాఫ్.. డిటేయిల్స్‌ను ‘360 డిగ్రీస్’ అనే ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా వడపోశారు. దీంతో 3,500 మంది ఉద్యోగులు ప్రతినెలా ఆసరా పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. అందులో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇంకా 2 వేల మంది మహిళలు విడో పెన్షన్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఉద్యోగం చేసే భర్త చనిపోయిన తర్వాత భార్యలకు ప్రభుత్వం అందించే పెన్షన్ తీసుకుంటూనే.. కొందరు మహిళలు ఆసరాకు సంబంధించి విడో, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

పెన్షన్ తీసుకుంటున్న ఇంజినీర్లు?

ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారి జాబితాలో జీహెచ్ఎంసీలో పని చేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లు సైతం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఏ విధంగా ఆసరా పెన్షన్లు పొందుతున్నారు? సొంత పలుకుబడి ఉందా? లేక రాజకీయ నేపథ్యం ఉన్న కారణంగా ఆ పెన్షన్ జాబితాలో చేరారా? అనే చర్చ జరుగుతున్నది.

ఫోరెనిక్స్ ఆడిట్ యోచనలో సర్కారు

రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల ఆధార్ నంబర్లను ఫోరెనిక్స్ ఆడిట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో లబ్ధిదారుల ఆర్థిక స్తోమత సులువుగా తెలిసిపోతుంది. ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్నవారు ఎంత మంది? ఎంత మందికి కార్లు ఉన్నాయి? ఎన్ని ఇండ్లు, ఎన్ని ఓపెన్ ప్లాట్స్ కొనుగోలు చేశారు? ఎంత మంది ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు? అనే అంశాలు బహిర్గతం అవుతాయని ప్రచారం జరుగుతున్నది.

ఫెషియల్ రికగ్నైజేషన్‌తో 5 వేల మంది అవుట్

గ్రామీణ ప్రాంతాల్లో బెడ్ రెస్ట్‌లో ఉన్న వయోవృద్ధులు పెన్షన్ కోసం డిస్ట్రిబ్యూటర్ సెంటర్‌కు వచ్చి ఐరీష్, థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చారు. తాజాగా ప్రభుత్వం ‘ఫేషియల్ రికగ్నైజ్డ్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పెన్షన్ కోసం సెంటర్‌కు రాలేని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మంది అటెండెన్స్ రాలేదని తెలిసింది. ఇంతకాలం చనిపోయిన కూడా వారి పేర్లతో నగదును స్థానిక సిబ్బంది నొక్కేశారని ప్రచారం జరుగుతున్నది.

Next Story