Ration Cards: కొత్త రేషన్ కార్డుల కీ అప్డేట్! ఏటీఎం సైజ్‌లో స్మార్ట్ కార్డులు.. ఎన్నో మార్పులు!

by Ramesh Naini |   (  Updated:2025-02-18 13:32:32  IST  )

కొత్త రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ స్పీడ్ పెంచింది.

Ration Cards: కొత్త రేషన్ కార్డుల కీ అప్డేట్! ఏటీఎం సైజ్‌లో స్మార్ట్ కార్డులు.. ఎన్నో మార్పులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ స్పీడప్ చేసింది. పాత కార్డుల్లా కాకుండా స్మార్ట్ కార్డు రూపంలో ఏటీఎం కార్డు సైజులో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్డుల డిజైన్‌ను రెడీ చేస్తోంది. ఒకవైపు సీఎం ఫొటో, మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఫోటో, మధ్యలో ప్రభుత్వ లోగో ఉంటుందని అధికారుల సమాచారం. కుటుంబ సభ్యుల ఫోటో పెట్టాలా వద్దా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. లేదంటే కుటుంబ సభ్యుల పేర్లు డీటెయిల్స్ ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కార్డు వెనుకవైపు అడ్రస్, రేషన్ షాప్ నెంబర్, ఇతర వివరాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు, కేరళ లాంటి తదితర రాష్ట్రాల్లో రేషన్ కార్డు తరహాలో ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు డిజైన్లను అధికారులు సీఎం రేవంత్‌కు చూపించారు.

ఒకసారి దరఖాస్తు చేస్తే చాలు..

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ లేని జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీకి కసరత్తు జరుగుతోంది. రేషన్ కార్డుల కోసం షార్ట్ టెండర్ పిలిచే పనిలో అధికారులు ఉన్నారు. మొదట లక్ష కార్డులు పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. కులగణన, ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవా సెంటర్ల ద్వారా ఇప్పటివరకు 4 రకాలుగా దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఎక్కడైనా ఒకచోట అప్లై చేస్తే చాలని, మళ్లీ చేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Next Story