- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రుల పేషిపై నిఘా పెంచిన సర్కారు.. ఇంటెలిజెన్స్‌కు బాధ్యతలు
రాష్ట్రంలోని మంత్రుల పేషీల్లో పనిచేస్తోన్న స్టాఫ్ కదలికలపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. మినిస్టర్ల పేర్లు చెప్పి ఆయా శాఖల్లో పీఎస్, ఓఎస్డీ, పీఏలు చేస్తున్న దందాలను గుర్తించే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మంత్రుల పేషీల్లో పనిచేస్తోన్న స్టాఫ్ కదలికలపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. మినిస్టర్ల పేర్లు చెప్పి ఆయా శాఖల్లో పీఎస్, ఓఎస్డీ, పీఏలు చేస్తున్న దందాలను గుర్తించే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే కొన్ని మంత్రుల పేషిల పనితీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుండటంతో సీఎంఓ అలర్ట్ అయినట్లు తెలిసింది.ఈ మధ్య ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌పై పలు ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఆతన్ని ఆ పదవి నుంచి తొలగించారు. దీంతో మిగతా మంత్రుల పేషిలో ఏం జరుగుతున్నదనే విషయాన్ని తెలుసుకునే పనిలో సీఎంఓ ఉంది. ఆ బాధ్యతలను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్‌కు అప్పగించడంతో మంత్రుల కార్యాలయ సిబ్బందిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఫైల్స్ క్లియరెన్స్ మాటున దందాలు..
మంత్రుల ఆమోదం కోసం వెళ్లే ఫైల్స్ ముందుగా పీఎస్, ఓఎస్డీల వద్దకు వెళ్తాయి. ఆ ఫైల్స్‌లోని సారంశాన్ని క్షుణ్ణంగా చదివి సదరు స్టాఫ్ మంత్రికి బ్రీఫ్ చేయాలి. ఇక్కడే పేషి సిబ్బంది తమ దందాలకు తెర లేపుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఫైల్ గురించి మంత్రికి పాజిటివ్‌గా చెప్పేందుకు పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ అడిగినంత ఇవ్వకపోతే ఫైల్ మీద నెగిటివ్ రిమార్క్స్ రాయిస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బును పేషి స్టాఫ్‌కు ముట్టచెప్పడం ఆనవాయితీగా మారిందని టాక్.
కొన్ని పేషిల్లో డిమాండ్ చేసినంత మొత్తంలో డబ్బులు ఇవ్వకపోతే మంత్రి ఆమోదం కోసం పంపకుండా తమ వద్దే నెలల కొద్ది ఫైల్స్ పెట్టుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు పీఎస్, ఓఎస్డీలు ‘మంత్రి సంతకం కోసం వచ్చే ఒక్కో ఫైల్‌కు ఒక్కో రేటు ఫిక్స్ చేస్తారు. అంత మొత్తంలో డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫైల్ ముందుకు కదలదు. ఒకవేళ కదిలినా నెగెటివ్‌గా రాసి పంపుతారు’ అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కామెంట్ చేశారు.
రెండు పేషిలు కలిసి వసూళ్లు..
సంబంధిత శాఖ సెక్రటరీ క్లియర్ చేసిన తర్వాతే మంత్రుల ఆమోదం కోసం వచ్చే ఫైల్స్ వస్తుంటాయి. ఇక్కడే సెక్రటరీ పేషిల్లో పనిచేస్తున్న స్టాఫ్ కొందరు మంత్రుల పేషిల్లో పనిచేసే స్టాఫ్ కుమ్మక్కై డబ్బులు డిమాండ్ చేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. ‘‘సెక్రటరీ ఆమోదం కోసం ఫైల్ వచ్చిన వెంటనే అక్కడ పనిచేసే స్టాఫ్ (సెక్రెటరీ పీఏ, పీఎస్) ఫైల్‌కు సంబంధించిన వ్యక్తులకు ఫోన్ చేస్తారు. సెక్రటరీ ముందు ఫైల్ పెట్టాలంటే ఎంత ఇవ్వాలో చెబుతారు. అలాగే మంత్రి పేషిల్లోని వ్యక్తులకు సైతం ఎంత ఇవ్వాలో ఇక్కడ సంకేతాలు ఇస్తారు. అందుకు ఒప్పుకుంటేనే ఆ ఫైల్‌ను క్లియర్ చేసి పైకి పంపుతారు. లేకపోతే అక్కడే పెండింగ్‌లో పెడ్తారు’ అని సెక్రెటేరియట్‌లో జరిగే దందా గురించి ఓ అధికారి వివరించారు.
అధికారులపై బూతు పురాణాలు..
అలాగే మరికొంత మంది మంత్రుల పేషీల్లో పనిచేస్తోన్న సిబ్బందిపైనా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. కొందరు మంత్రుల పేర్లు చెప్పి ఆయా శాఖల అధికారులపై పెత్తనం చెలాయిస్తారని, తాము చెప్పిన పని వెంటనే పూర్తి చేయకపోతే బూతులు తిట్టడం పరిపాటిగా మారిందని టాక్. మంత్రుల ఇంట్లో జరిగే శుభకార్యాలు, పండుగలకు కావాల్సిన అవసరాలను సైతం తీర్చాలని ఒత్తిడి చేయడం రోటిన్‌గా మారిందని ప్రచారం ఉంది. కొన్ని పేషిల్లోని స్టాఫ్ మంత్రుల పేర్లు చెప్పి సొంత పనుల కోసం ఆ శాఖ పరిధిలోని కార్యాలయం వాహనాలను ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు ఒప్పుకోకపోతే మంత్రికి ఎక్కడ ఫిర్యాదు చేస్తారనే భయంతో మౌనంగా ఉంటున్నట్లు ప్రచారం ఉంది. ‘మంత్రి ఆ పని చేయమన్నడు. ఈ పని చేయమన్నడు’ అంటూ చిన్న చిన్న పనుల కోసం జిల్లా అధికారులకు ఫోన్ చేస్తుంటారనే విమర్శలు ఉన్నాయి.
అపాయింట్మెంట్‌కు ముడుపులు..
కొందరు పీఏలు, ఓఎస్డీలు మంత్రుల అపాయింట్మెంట్ ఇప్పించేందుకు ముడుపులు తీసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. మంత్రి ఆఫీసుకు ఎప్పుడు వస్తారు? ఇంట్లో ఏ టైమ్‌లో అందుబాటులో ఉంటారు? టూర్ షెడ్యూల్ ఏమిటి? అనే వివరాలను బిజినెస్ పర్సన్లు, కింది స్థాయి లీడర్లకు సమాచారం ఇచ్చి ముడుపులు తీసుకుంటున్నట్లు ప్రచారం ఉంది. అలాగే, మంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించినందుకు సైతం డబ్బులు గుంజుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. కొన్ని పేషిల్లో మంత్రులు ఇచ్చే సిఫారసు లెటర్లకు సైతం డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read More..
నాకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు.. కొండా మురళి కీలక వ్యాఖ్యలు






