- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల ముగిసిపోతున్నా జీతాలు రాలే.. ప్రభుత్వ డాక్టర్ల ఆవేదన
నెల ముగిసిపోతున్నా జీతాలు రాలే.. ప్రభుత్వ డాక్టర్ల ఆవేదన

దిశ, తెలంగాణ బ్యూరో: డాక్టర్లు నెలనెలా జీతాలు అడుక్కునే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని.. ఇందులో సమస్య లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకునాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) డిమాండ్ చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)లో డిసెంబర్ నెల ముగిసిపోతున్నా కొందరు డాక్టర్లు, సిబ్బందికి జీతాలే రాలేదని టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డా. నరహరి పేర్కొన్నారు. ఇందుకు టీవీవీపీ కమిషనర్ తీరే కారణమని ఆయన మండిపడ్డారు. జీతాల ఆలస్యానికి కమిషనరే బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులు ఎదుర్కుంటున్న అనేక సమస్యలపై శనివారం కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట టీజీజీడీఏ విలేఖరుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 33 జిల్లాల నుంచి వైద్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీవీవీపీలో జీతాల చెల్లింపు ఆలస్యం సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీవీవీపీని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీ.ఎస్.హెచ్) గా మార్పు చేయడమే పరిష్కారమని నరహరి తెలిపారు.
అదిగో ఇదిగో అంటూ ఈ అంశాన్ని ఆలస్యం చేస్తున్నారని అయితే త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశం త్వరగా పరిష్కారమైతే అనేక మంది పదోన్నతులు కొలిక్కి వస్తాయన్నారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారికే డిఫ్యుటేషన్లు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలకు నేటికీ రెగ్యులర్ ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్స్ లేరని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన అన్ని మెడికల్ కాలేజీల్లో పనిచేసే వారికి పెరిఫెరల్ మెడికల్ కాలేజ్ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. దీనివల్ల అధ్యాపకులు చేరేందుకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు.
కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్, నిమ్స్ స్కేల్స్, పెరిఫెరల్ సంస్థల నుంచి హైదరాబాద్‌కు ఫ్యాకల్టీ ట్రాన్స్‌ఫర్లు, ఎం.ఎన్.జె ఇన్‌స్టిట్యూట్, మహబూబ్ నగర్, రిమ్స్, సిద్ధిపేట మెడికల్ కాలేజీలను అటానమస్ నుంచి పూర్తిస్థాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా మార్చాలని, డైరెక్టర్ హెల్త్ విభాగంలో జీవో 142 సవరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రభుత్వం కొత్తగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను నియమించిందని వారికి పూర్తి స్థాయి అధికారాలన్నీ కట్టబెట్టాలని చూడటం వైద్య వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
రిటైర్ అయ్యే వరకు పదోన్నతులే లేవు...
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో రిటైర్ అయ్యే వరకు పదోన్నతులే రావడం లేదని... అలా కాకుండా టైమ్-బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని టీజీజీడీఏ సెక్రటరీ జనరల్ డా. లాలు ప్రసాద్ రాథోడ్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా టీవీవీపీని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్చినప్పుడు తెలంగాణలో మార్చేందుకు ఎందుకు ఆలస్యమవుతోందని ఆయన ప్రశ్నించారు. తమ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా ఉన్నా అధికారులే కావాలని తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. వైద్యవిధాన పరిషత్ ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్చేందుకు పైసా ఖర్చు అవ్వదని అస్కి నివేదిక ఇచ్చినా ఎందుకు సమస్య పరిష్కారం కావడం లేదని టీజీజీడీఏ రాష్ట్ర కోశాధికారి డా. రౌఫ్ వాపోయారు. తమ సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీజీజీడీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. కృష్ణారావు, డా. దీన్ దయాల్, కార్యదర్శులు డా. మురళీధర్, డా. రాంసింగ్, కార్యవర్గ సభ్యులు డా. కృపాల్ సింగ్, డా. చింత రమేష్, డా. కోటేశ్వర్, డా. సుధాకర్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైద్యులు పాల్గొన్నారు.






