ప్రభుత్వ ఆధీనంలోకి ‘హైదరాబాద్ మెట్రో’.. ఎల్‌అండ్‌టీతో ఒప్పందం పూర్తి

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-29 15:25:15  IST  )

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకుంది.

ప్రభుత్వ ఆధీనంలోకి ‘హైదరాబాద్ మెట్రో’.. ఎల్‌అండ్‌టీతో ఒప్పందం పూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ వశమైంది. ఈ మెట్రో ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్అండ్‌టీ (L&T) సంస్థ నుంచి 100 శాతం షేర్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన షేర్ల బదిలీ ప్రక్రియ ఇవాళ అధికారికంగా పూర్తయింది. మెట్రో ప్రాజెక్టులో ఎల్అండ్‌టీకి ఉన్న మొత్తం వాటాను ప్రభుత్వం రూ.1,461.47 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ నిధులను చెల్లించడంతో మెట్రో రైలు ఆస్తులు, నిర్వహణ బాధ్యతలు ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చాయి. దీంతో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో నడుస్తున్న ఈ ప్రాజెక్టు ఇకపై ప్రభుత్వ సంస్థగా మారనుంది. నిజానికి ఈ స్వాధీన ప్రక్రియను ఈ ఏడాది మార్చి 31 నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ కొనుగోలు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి ప్రభుత్వం ఆశించిన రుణం మంజూరు కావడంలో కొంత సాంకేతిక ఆలస్యం జరిగింది. నిధుల విడుదల ఆలస్యం కావడంతో గడువును పొడిగించాల్సి వచ్చింది. తాజాగా నిధులు అందడంతో ఈ ప్రక్రియకు ముగింపు పలికారు.

ప్రయాణికులకు బెనిఫిట్స్ ఇవే..

మెట్రో తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోకి రావడం వల్ల భవిష్యత్తులో టికెట్ ధరల నియంత్రణ, మెట్రో రెండో దశ విస్తరణ పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రైవేట్ సంస్థ లాభాపేక్ష కంటే ప్రజా సేవకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

Next Story