ఇక్కత్ చీరలపై పరిశోధన.. గోసికొండ శ్రీరాములుకు బాధ్యతలు

by Gantepaka Srikanth |

తెలంగాణలో పోచంపల్లి ఇక్కత్ చీరలు చాలా ఫేమస్. అలాగే బెనారస్ చీరలు కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటిపై అధ్యయనం చేసేందుకు ఐసీఎస్ఎస్ఆర్ నిర్ణయించింది.

ఇక్కత్ చీరలపై పరిశోధన.. గోసికొండ శ్రీరాములుకు బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పోచంపల్లి ఇక్కత్ చీరలు చాలా ఫేమస్. అలాగే బెనారస్ చీరలు కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటిపై అధ్యయనం చేసేందుకు ఐసీఎస్ఎస్ఆర్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన డా.గోసికొండ శ్రీరాములు ఎంపికయ్యారు. ఆయన పోచంపల్లి ఇక్కత్, బెనారస్ చీరలు ఉత్పత్తయ్యే చేనేత ప్రాంతాల్లో పరిశోధన చేయనున్నారు. కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఢిల్లీలోని భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధన మండలి(ఐసీఎస్ఎస్ఆర్) వారు "భారతదేశంలోని నేత సముదాయాలు: భౌగోళిక గుర్తింపు, చేనేత లోగో గల క్లస్టర్లలోని నేత కార్మికుల యొక్క సామాజిక-ఆర్థిక, రాజకీయ స్థితి గతులపై ఒక సమగ్ర అధ్యయనం" అనే అంశంపై నలుగురు పరిశోధకులతో కూడిన బృందానికి రూ.10 లక్షల గ్రాంటును విడుదల చేసింది. డా.శ్రీరాములు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా వ్యవహరించే ఈ పరిశోధన కోసం ప్రొ.జాడి బాలకొమరయ్య(బీహెచ్ యు), డా.చిత్తూరు ప్రకాష్ (అలహాబాద్ యూనివర్సిటీ), డా.పచ్చవ వెంగళ రావు (నల్సార్ యూనివర్సిటీ, హైదరాబాద్) ఒక సంవత్సరం పాటు కలిసి పని చేయనున్నారు. చేనేత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన శ్రీరాములుకు నేతన్నల ప్రస్తుత పరిస్థితిపై పరిశోధన గ్రాంటు లభించడం పట్ల విశ్వ విద్యాలయ సహోద్యోగులు, గ్రామస్థులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story