రాజాసింగ్ పేరుతో కుట్రలు.. ప్రకంపనలు సృష్టిస్తున్న ఉషా బాయి వ్యాఖ్యలు!

by Disha Web Desk 2 |
రాజాసింగ్ పేరుతో కుట్రలు.. ప్రకంపనలు సృష్టిస్తున్న ఉషా బాయి వ్యాఖ్యలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషా బాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ పేరు చెప్పుకుంటూ కొందరు కుట్రలు చేస్తూ సొంత రాజకీయ లబ్ధి కోసం ఆయనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి వారి పట్ల పార్టీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులు జాగ్రత్తగా ఉండాలని ఉషాబాయి అలర్ట్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆమె అందులో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజాసింగ్ లో ప్రవహించేది కాషాయ రక్తమే అని హిందూ ధర్మ కోసం ఎన్ని కష్టాలు ఎదుర్కొవడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తమకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం కష్టపడే రాజాసింగ్ అదే ధర్మం కోసం జైల్లో ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ విషయంలో హిందూ సమాజం, బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులంతా మాకు అండగా నిలిచారు. మీరిచ్చిన ధైర్యానికి ధన్యవాదాలు. రాజాసింగ్, ఆయన కుటుంబం అనాథ కాదు అని మీరంతా చాటి చెప్పారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్ పేరుతో కొంత మంది సొంత రాజకీయ లబ్ధి కోసం ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టేలా ప్రయత్నిస్తున్నారు. హిందుత్వం పేరుతో కుట్రలు చేస్తున్నారు. రాజాసింగ్ కు జైళ్లు, కేసులు కొత్తేమి కాదు. ఆయన క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త. ఆయన చేతిలో ఉండేది కమలం జెండానే. ఆయనలో ప్రవహించేంది కాషాయ రక్తమే. ధర్మం పేరుతో కొందరు చేస్తున్న కుట్రలను పసిగట్టి తిప్పికొడదాం అంటూ ఉషాబాయి పిలుపునిచ్చారు.

ప్రకంపనలు సృష్టిస్తున్న ఉషా బాయి వ్యాఖ్యలు:

వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పీడీ యాక్ట్ కింద ఎమ్మెల్యే రాజాసింగ్ ను చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. అంతకు ముందే ఆయన్ను పార్టీ నుండి బీజేపీ సస్పెండ్ చేసింది. అయితే రాజాసింగ్ విషయంలో బీజేపీలో అంతర్మథనం మొదలైందని ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయబోతున్నారనే చర్చ జరుగుతున్న వేళ ఉషా బాయి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. రాజాసింగ్ ను సస్పెండ్ చేయడం వల్ల కట్టర్ హిందువులు పార్టీకి దూరం అవుతున్నారని, మునుగోడుపై ఈ ప్రభావం పడకుండా ఉండాలంటే ఆయనపై విధించిన బహిష్కరణ వేటును తొలగించాలనే చర్చ రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్ పేరుతో కుట్ర జరుగుతోందని ఉషాబాయి చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అనేది దుమారం రేపుతోంది. రాజాసింగ్ దేశం కోసం, ధర్మం కోసమే జైలు పాలయ్యారని ఈ కష్టాలు తనకు కొత్తేమి కాదంటూనే కుట్రలు చేస్తున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండాలనే చర్చను తీసుకురావడం వెనుక అసలేం జరుగుతోందనేది సందేహంగా మారింది.

మునుగోడు ఎన్నిక తర్వాత కీలక నిర్ణయం?:

పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయి జైలులో రాజాసింగ్ ఉంటే గోషామహాల్ బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోందట. రాజాసింగ్ జైలు పాలవడంతో ఇక్కడ బీజేపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. దాంతో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు రాజాసింగ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారనే ప్రచారం నియోజకవర్గంలో గుప్పుమంటోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన విడుదల కాకుంటే బీజేపీ టికెట్ ను దక్కించుకునేందుకు పలువురు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక భర్త అరెస్ట్ తో రాజాసింగ్ భార్య ఉషాబాయి సైతం యాక్టివ్ గానే వ్యవహరిస్తున్నారు. తన భర్త విషయంలో తరచూ పెద్దలతో భేటీ అవుతూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర అంశం తెరపైకి వస్తోంది. మునుగోడు ఎన్నిక తర్వాత రాజాసింగ్ పై చర్యలకు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చర్చ జరుగతోంది. రాజాసింగ్ ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని ఎంఐఎం పట్టుబడుతోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ లను టీఆర్ఎస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన అనుభవం ఉంది. అయితే ఆ కొద్ది రోజులకే సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడంతో ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం రాలేదు. కానీ మునుగోడులో ఫలితం తమకు అనుకూలంగా వస్తే ఆ జోష్ ను కొనసాగించేలా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసే ఆలోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


Next Story

Most Viewed