‘వాట్సాప్ మీసేవ’తో సత్ఫలితాలు.. పౌరసేవలకు అద్భుత స్పందన

by Ajay Maddhiboyina |

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మీసేవ వాట్సాప్‌నకు భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సేవల విధానం తక్కువ కాలంలోనే రాష్ట్ర ప్రజలకు చేరువైంది. 2025 నవంబర్ 18న ఐటీశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు సేవలను ప్రారంభించారు.

‘వాట్సాప్ మీసేవ’తో సత్ఫలితాలు.. పౌరసేవలకు అద్భుత స్పందన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మీసేవ వాట్సాప్‌నకు భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సేవల విధానం తక్కువ కాలంలోనే రాష్ట్ర ప్రజలకు చేరువైంది. 2025 నవంబర్ 18న ఐటీశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు సేవలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 80969 58096 నెంబర్ ద్వారా 24 గంటల పాటు పౌరసేవలు పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. దీంతో ప్రజలు పెద్దసంఖ్యలో వినియోగించుకుంటున్నారు. వాట్సాప్ మీసేవ ద్వారా ఇప్పటివరకు 4.5 ల‌క్షల మంది వివిధ పౌరసేవల కోసం న‌మోదు చేసుకోగా.. 3.25 ల‌క్షల మంది డిజిటల్ సేవలు పొందినట్లు అధికారులు వెల్లడించారు. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఐదువేలకు పైగా కేంద్రాలు ప్రతిరోజూ 80వేల మంది నుంచి లక్ష మందికి డిజిటల్ పౌరసేవలు అందిస్తున్నాయి.

581 రకాల సేవలు

వాట్సాప్ మీసేవ నుంచి ప్రభుత్వం 10శాఖలకు సంబంధించి 581 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా ప్రధానంగా కులం, ఆదాయం సర్టిఫికెట్లు పొందడం చాలా సులభమైంది. ఎక్కువ మంది ఆదాయ‌ం, బర్త్, డెత్, రెసిడెన్సీ సర్టిఫికెట్, పోలీస్ చలానా, రెన్యువల్ ఆఫ్ రేషన్ షాప్స్, టెంపుల్ సర్వీసెస్, బిల్డింగ్ పర్మిషన్, వెహికిల్ లైఫ్ ట్యాక్స్, లైసెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్ సేవలను వాట్సాప్‌లోనే పొందవచ్చు. మీసేవ సర్టిఫికెట్ల స్టేటస్, తాజా అప్‌డేట్స్ సైతం వాట్సాప్‌లోనే తెలుసుకోవడం.. ఆమోదం పొందిన సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండటంతో మీసేవా సెంటర్లకు వెళ్లే శ్రమ తగ్గినట్లయింది. అలాగే రాష్ట్రంలో 31 ఆలయాల సేవలను పొందే అవకాశం కల్పించారు. భక్తుల దర్శనం, వసతి త‌దిత‌ర సేవ‌లు ఇందులోనే బుక్ చేసుకోవచ్చు.

త్వరలో అత్యవసర సేవలు

రానున్న రోజుల్లో ఎమర్జెన్సీ సేవలను సైతం వాట్సాప్ మీసేవ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. 108, 102, అగ్నిమాపక సేవలకు 101, ఎస్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్, ముఖ్యమైన హెల్ప్ లైన్ నెంబర్లను దీనికి లింక్ చేయనున్నారు. 2023 నవంబర్1 నుంచి 2026 జనవరి 31 వ‌ర‌కు, మీసేవా ద్వారా 5.98 కోట్ల లావాదేవీలు జరగ్గా.. వాటిమొత్తం విలువ రూ.3,811 కోట్లు అని అధికారులు తెలిపారు. ఈ విధానం ద్వారా మధ్యవర్తుల పాత్ర తొలగిపోయి ఆఫీసుల చుట్టూ తిరిగే పని తగ్గిందని ప్రజలు పేర్కొంటున్నారు.

Next Story