మహిళామణులకు తీపికబురు.. స్వయం సహాయక సంఘాల్లో ఇక బాలికలు

by Kema Shiva Kumar |

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం చెబుతున్నది.

మహిళామణులకు తీపికబురు.. స్వయం సహాయక సంఘాల్లో ఇక బాలికలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం చెబుతున్నది. ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి మిషన్-2025లో కింద కోటి మంది మహిళలను స్వయం సహాయక బృందాల్లో చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నది. సంఘాల్లో చేరని మహిళలు, 15-18 సంవత్సరాల బాలికలను సైతం సంఘాల్లో చేర్చుకునేలా ప్రణాళిక రూపొందించింది. అంతేకాకుండా అరవై ఏళ్లు పైబడిన మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఈ సంఘాల ఏర్పాటు, పర్యవేక్షణకు సంబంధించిన మార్గదర్శకాలను ఇటీవల గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సీఈఓ దివ్య దేవరాజన్ విడుదల చేశారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. రోజువారీ పురోగతిని ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమానికి డీఆర్డీడీఓలు, ఏపీఎంలు, సీసీలు మార్గదర్శకత్వం వహించనున్నారు.

ప్రత్యేక ప్రణాళిక

ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి సెర్ప్ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఇంకా సంఘాల్లో చేరని మహిళలు, దివ్యాంగులు, వృద్ధ మహిళలను గ్రామాల్లో గుర్తించాల్సి ఉంటుంది. పింఛన్ దారుల జాబితాలు (ఓఏపీ, పీడబ్ల్యూడీ), ఉపాధి హామీ జాబ్ కార్డులు, గ్రామ పంచాయతీ ఇంటి పన్ను జాబితాలను ఉపయోగించి ఈ జాబితాలను రూపొందించవచ్చు. కొత్త స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం లేదా అర్హులైన వారిని ఇప్పటికే ఉన్న సంఘాలలో చేర్పించాలి. అనంతరం, వారి కోసం పొదుపు ఖాతాలను సమీప బ్యాంకుల్లో తెరవాలి. సభ్యుల వివరాలు, స్వయం సహాయక సంఘాల వివరాలను సెర్ప్ పోర్టల్స్‌ లో నమోదు చేయాలి. స్వయం సహాయక బృందాల ద్వారా వారికి బ్యాంకు లింకేజీలు, సీఐఎఫ్ రుణాలు, స్త్రీనిధి రుణాలు, సెర్ప్ నుండి రివాల్వింగ్ ఫండ్ వంటి ఆర్థిక సహాయాలు కూడా అందిస్తారు.

మార్గదర్శకాలు ఇలా..

ఒక సంఘంలో 10 నుండి 15 మంది సభ్యులు ఉండేలా, ప్రత్యేక పరిస్థితుల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కూడా సంఘాలను ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నారు. 60 సంవత్సరాలు పైబడిన మహిళలు మాత్రమే ఈ సంఘాల్లో చేరడానికి అర్హులని, ప్రస్తుతం మహిళా స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నవారు అనర్హులని తెలిపారు. పదవీ విరమణ పొందిన వారు సంఘ తీర్మానం ఆధారంగా చేరవచ్చు. తమ పనులు తాము చేసుకోగలిగేవారు, ఇతరుల సహాయం పాక్షికంగా అవసరమైనవారు సభ్యులుగా ఉండవచ్చని తెలిపారు. పూర్తిగా శారీరక శక్తి కోల్పోయి, అనారోగ్యంతో మంచాన పడినవారు అనర్హులని తెలిపారు. సంఘం పేరు మీద బ్యాంకులో పొదుపు ఖాతా తెరవాలి. సభ్యులు తమ ఆదాయం ప్రకారం ప్రతినెల పొదుపు చేసుకోవాలి. సభ్యుల అవసరాల కోసం పొదుపు చేసిన డబ్బును బ్యాంకు నుండి విత్‌డ్రా చేసి అంతర్గత రుణాలుగా ఇవ్వాలి. కనీసం 15 రోజులకోసారి తప్పనిసరిగా సమావేశం నిర్వహించాలి. సంఘం పనితీరు ఆధారంగా గ్రేడింగ్ చేసి, నియమాల ప్రకారం ఆర్‌ఎఫ్‌, వీఆర్‌ఎఫ్ నిధులు అందిస్తారు.

అధికారుల బాధ్యతలు

వృద్ధ మహిళా సంఘాల అవశ్యకతపై జిల్లా, మండల, గ్రామ సమాఖ్య సమావేశాల్లో చర్చించి, వార్షిక కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలి. అర్హులైన వృద్ధ మహిళలను గుర్తించి, సంఘాలుగా ఏర్పాటు చేయాలి. వారికి చట్టపరమైన హక్కులు, రక్షణలపై అవగాహన కల్పించాలి. ప్రభుత్వ పథకాల గురించి వివరించి, అర్హులైన వారికి అవి అందేలా చూడాలి. మండల పరిషత్, మండల రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు, బ్యాంకు మేనేజర్లకు ఈ సంఘాల గురించి తెలియజేయాలి. గ్రామ పంచాయతీ, గ్రామంలోని ప్రముఖ వ్యక్తుల సహకారం తీసుకోవాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్డీఏ అధికారులు ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా వృద్ధ మహిళలు ఎదుర్కొంటున్న ఆర్థిక భద్రత లేకపోవడం, ఒంటరితనం, కుటుంబంలో గుర్తింపు లేకపోవడం వంటి సమస్యలను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.

దివ్యాంగుల కోసం..

తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పాలసీలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలతో పాటు దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు ఆర్థికంగా, సామాజికంగా చేయూత అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో 44,478 మంది దివ్యాంగులు 6,147 సంఘాలుగా ఏర్పడి ఉన్నారు. ఇప్పటికే ఉన్న సంఘాలను పునరుద్ధరించడం, బలోపేతం చేయడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా జరుగుతుంది.

నెలాఖరుకు పూర్తయ్యేలా..

గ్రామంలో పెన్షన్ పొందుతున్న దివ్యాంగుల వివరాలు సేకరించి, వారిని గ్రామ, మండల స్థాయి సిబ్బంది కలిసి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేస్తారు. దివ్యాంగులను ఆగస్టు 14వ తేదీలోపు గుర్తించాల్సి ఉన్నది. అన్ని గ్రామాల్లో దివ్యాంగుల సంఘాలపై అవగాహనా కార్యక్రమాలను ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేయాలి. కొత్త సంఘాల ఏర్పాటు ఈ నెల మూడో వారంలోపు పూర్తి చేయాలి. సంఘాలుగా ఏర్పాటు చేసిన తర్వాత తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలు తెరవాలి. ఆగస్టు చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఒక్కో సంఘంలో కనీసం 5 నుంచి గరిష్టంగా 20 మంది సభ్యులు ఉండవచ్చు. మహిళలు, పురుషులు ఇద్దరూ సభ్యులుగా చేరవచ్చు. 18 సంవత్సరాలలోపు వారికి వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ప్రతినిధులుగా వ్యవహరించవచ్చు. కొత్తగా ఏర్పడిన సంఘాలకు, ఇంకా రివాల్వింగ్ ఫండ్ అందని సంఘాలకు నిబంధనల మేరకు రివాల్వింగ్ ఫండ్ అందిస్తారు. సభ్యులకు నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి శిక్షణలు ఏర్పాటు చేసి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తారు. అవసరమైన వారికి కృత్రిమ పరికరాలను సమకూర్చడానికి వికలాంగుల శాఖ, ఎన్జీఓల సహకారం తీసుకుంటారు. సభ్యుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి నిపుణుల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Next Story