అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఇకపై ఒకటో తారీఖునే జీతాలు!

by Kema Shiva Kumar |

తెలంగాణలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఇకపై ఒకటో తారీఖునే జీతాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటికే ప్రతి నెల ఒకటో తారీఖున టంచన్‌గా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇకపై కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం అదే రోజున జీతాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అందుకోసం అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సేవలు అందించే ఏజెన్సీలకు వారం రోజుల ముందే బిల్లులు చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం. తద్వారా ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ మాసం జీతం మే ఒకటో తేదీన ఉద్యోగుల ఖాతాల్లో పడేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

5 లక్షల మందికి లబ్ధి..

ప్రస్తుతం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఏ తేదీన వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. కొన్ని శాఖలు మొదటి వారంలో, మరికొన్ని రెండో వారంలో, ఇంకొన్ని శాఖల్లో అయితే ఏకంగా నెల చివరన చెల్లిస్తున్నారు. దీంతో ఉద్యోగులు ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి, రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ అధికారులు అన్ని శాఖలకు, హెచ్‌ఓడీ (HOD)లకు లేఖలు రాసి, ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ప్రతి నెల 25వ తేదీ నుంచి తర్వాతి నెల 25వ తేదీ వరకు ఒక నెలగా పరిగణించి బిల్లులను క్లెయిమ్ చేస్తుంటారు. ఇదే పద్ధతిని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వారికి కూడా అమలు చేయడం వల్ల దాదాపు 5 లక్షల మంది ప్రయోజనం పొందనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఏజెన్సీలు బాధ్యతగా అటెండెన్స్‌ను ప్రతి నెల 25వ తేదీ లోపు సంబంధిత శాఖలకు సమర్పించాల్సి ఉంటుంది.

ఏజెన్సీలపై మానిటరింగ్..

ఇప్పటివరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపు విషయంలో సదరు ఏజెన్సీలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేదు. అయితే ఇక నుంచి జీతాల చెల్లింపు, పీఎఫ్ (PF), ఇతర అంశాలను ఆర్థిక శాఖ పర్యవేక్షించనుంది. అందుకోసం ఒక ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించినట్లు తెలిసింది. ఈ పోర్టల్‌లోనే ఏజెన్సీలు విధిగా ఉద్యోగుల వివరాలను నమోదు చేయాలి. పూర్తి వివరాలు అందించిన ఏజెన్సీలకు వారం రోజుల ముందే ప్రతి నెల బిల్లులు చెల్లిస్తారు. ఏజెన్సీలు తమ వాటా కింద పీఎఫ్, ఈఎస్‌ఐ (ESI) చెల్లించకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Next Story