- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బడ్జెట్లో ఫ్లాట్స్ చూస్తున్నారా?.. మిడిల్ క్లాస్ పీపుల్స్‌కు గుడ్ న్యూస్
ప్రతి మనిషికి సొంతంగా ఒక ఇల్లు కట్టుకొని అందులో పిల్లాపాపలతో హ్యాపీగా బ్రతకాలని కోరిక ఉంటుంది.

దిశ, సంగారెడ్డి : ప్రతి మనిషికి సొంతంగా ఒక ఇల్లు కట్టుకొని అందులో పిల్లాపాపలతో హ్యాపీగా బ్రతకాలని కోరిక ఉంటుంది. కొంతమందికైతే ఇల్లు కట్టడమే లక్ష్యంగా పగలు, రాత్రి తేడా లేకుండా ఇంటిల్లిపాదంతా శ్రమిస్తుంటారు. అద్దె ఇంట్లో ఇరుకు గదుల్లో ఉండలేక, ఆర్థిక స్థోమత సరిగా లేక సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుంది మరికొందరికి. ఎలాగైనా అప్పో, సొప్పో చేసి అయినా లేక ఫైనాన్స్ చేసి అయినా సొంత ఇంటి కల సాకారం చేసుకుంటారు మరికొందరు. తమ బడ్జెట్లో సొంత ఇల్లు రాకపోవడంతో తమ వద్ద ఉన్న బడ్జెట్ కే మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొని అందులో ఉండేందుకు ఇప్పుడు ఎక్కువ శాతం మంది మక్కువ చూపుతున్నారు. నాలుగు సంవత్సరాలుగా సంగారెడ్డి జిల్లా కేంద్రం చుట్టుపక్కన ప్రాంతాల్లో అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయింది. కోవిడ్ తర్వాత సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి, కంది, మల్కాపూర్, కొత్తలాపూర్, రాజంపేట, కల్వకుంట, శాంతినగర్ వంటి ఇతర ప్రాంతాల్లో ఒక్కసారిగా అపార్ట్మెంట్ల కట్టడాలు బాగా పెరిగిపోయాయి. అయితే ఈ ప్రాంతాల్లో మధ్యతరగతి వారికి అందనంతగా భూముల ధరలు పెరగడమే అపార్ట్మెంట్ కల్చర్ పెరుగుదలకు ప్రధాన కారణం.
బడ్జెట్ లోనే సొంతిల్లు..
సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతంలో ఒక 150 గజాల భూమి తీసుకోవాలంటే ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం 30 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. భూమి కొన్నాక ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి మరో 30 లక్షల నుంచి 35 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మొత్తంగా వెరసి 70 లక్షల నుంచి 80 లక్షల వరకు ఉంటేనే 150 గజాల్లో ఇంటి నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి లేదు. దీంతో చాలామంది అంత డబ్బు ఖర్చు చేసి ఇల్లు కట్టుకోలేక తక్కువ ధరకు కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలో డబుల్ బెడ్ రూమ్ లేదా త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్లను కొనుకుంటున్నారు. కాగా ఇప్పుడు సంగారెడ్డి చుట్టుపక్కన ప్రాంతాల్లో మొత్తం 45 నుంచి 50 వరకు అపార్ట్మెంట్లు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కైతే 35 లక్షల నుంచి 40 లక్షలు, అదే త్రిబుల్ బెడ్ రూమ్ కైతే 60 లక్షల నుంచి 65 లక్షలు వరకు అమ్మకాలు సాగుతున్నాయి. ఇప్పుడు 600లకు పైగా కొత్తగా ప్లాట్లు కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టు బిల్డర్లు చెబుతున్నారు. ఒక్కో అపార్ట్మెంట్లో 10 నుంచి 15 వరకు కుటుంబాలు నివసించేలా వీటిని బిల్డర్లు తీర్చిదిద్దుతున్నారు. సెక్యూరిటీ పరంగా కూడా ఇవి ఎంతో మేలు అంటూ చాలామంది వీటిని సొంతంగా కొని అందులో ఉండేందుకు మక్కువ చూపుతున్నారు.
కొన్నిసార్లు నష్టాలూ తప్పవు
సంగారెడ్డి చుట్టుపక్కన ప్రాంతాల్లో దాదాపు 50 వరకు అపార్ట్మెంట్లు ప్రస్తుతం ఉన్నాయి. అయితే కొన్నిసార్లు మార్కెట్ లేనప్పుడు బిల్డర్లకు విపరీతమైన నష్టం వచ్చే ప్రమాదం కూడా ఉంది. లాభం ఎలా ఉంటుందో నష్టం కూడా ఒక్కోసారి అలాగే ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ధరకి కస్టమర్లకు విశాలమైన ఏరియాతో మంచి వసతులతో ప్లాట్లు అందించడమే మొదటి ప్రాధాన్యతగా వీటిని నిర్మించి వారికి అందిస్తాం. - బసవరాజు శ్రీధర్, ఎస్ ఆర్ హార్మోని బిల్డర్, సంగారెడ్డి






