ఆ డాక్టర్లకు గుడ్ న్యూస్.. ఒకే సారి స్టైఫండ్ 15% హైక్

by Ajay Maddhiboyina |

ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇంటర్న్‌షిప్ స్టైఫండ్, పీజీ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ల స్టైఫండ్స్‌ను 15 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది.

ఆ డాక్టర్లకు గుడ్ న్యూస్.. ఒకే సారి స్టైఫండ్ 15% హైక్
X

దిశ తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇంటర్న్‌షిప్ స్టైఫండ్, పీజీ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ల స్టైఫండ్స్‌ను 15 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన జీవో 90 (28.06.2025) విడుదల చేసింది. ఈ పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్‌‌లో రూ.67,032, సెకండ్ ఇయర్‌‌లో రూ.70,757, ఫైనల్ ఇయర్‌‌లో రూ.74,782 చొప్పున స్టైఫండ్ అందనుంది. సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్‌‌లో రూ.1,06,461, సెకండ్ ఇయర్‌‌లో రూ.1,11,785, థర్డ్‌ ఇయర్‌‌లో రూ.1,17,103 చొప్పున స్టైఫండ్ అందనుంది. అలాగే, సీనియర్ రెసిడెంట్లకు డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.92,575 నుంచి రూ.1,06,461 పెంచుతున్నట్టు జీవోలో పేర్కొన్నారు. పెంచిన స్టైఫండ్స్‌ను ఇకపై ప్రతి నెలా 10వ తేదీన చెల్లించాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు సంవత్సరానికి సరిపడా స్టైఫండ్స్ చెల్లించేందుకు అవసరమైన బీఆర్‌‌వోను (బడ్జెట్ రిలీజ్ ఆర్డర్) అధికారులు విడుదల చేశారు. అంతేకాదు,పెండింగ్ స్టైఫండ్ బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం జూడాల ఖాతాల్లో స్టైఫండ్ డబ్బులు జమ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్స్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇతర సిబ్బంది ఉద్యోగ కాలాన్ని మరో ఏడాది పాటు పెంచుతూ ఆర్థిక శాఖ జీవో విడుదల చేసింది. దీంతో వీరికి రెగ్యులర్ వేతనాలు చెల్లించేందుకు మార్గం సుగమం అయింది.

రిక్రూట్‌మెంట్, ప్రమోషన్స్‌తో టీచింగ్ ఫాకల్టీ సమస్యకు చెక్

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫాకల్టీ సమస్యకు చెక్ పెడుతూ పలు చర్యలను ప్రభుత్వం తీసుకుంది. రెండ్రోజుల క్రితమే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేయనున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ డీఎంఈ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్‌ చేసుకునే అవకాశం లేకపోవడంతో, ప్రమోషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ప్యానెల్ ఇయర్ రిలాగ్జేషన్‌ సైతం ఇచ్చినట్టు మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుమారు 231 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 308 మందికి, ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇచ్చింది. ఈ చర్యలో అన్ని కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత, డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీల సమస్య తీరనున్నది. అర్హత కలిగిన 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చింది. ఈ ప్రమోషన్లతో రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్స్‌, టీచింగ్ హాస్పిటళ్లకు రెగ్యులర్ సూపరింటెండెంట్లు రానున్నారు.

మౌలిక సదుపాయాల కల్పన

తెలంగాణలో 2021 సంవత్సరం నాటికి 9 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం 2022లో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు, 2023లో 9 కాలేజీలు ఏర్పాటు చేసింది. 2024లో మరో 8 కాలేజీల ఏర్పాటుకు జీవోలు ఇచ్చింది. కాలేజీ బిల్డింగులు, హాస్టల్ బిల్డింగులు, అనుబంధంగా హాస్పిటళ్లు లేకుండానే 2022, 2023లో 17 కాలేజీలు ప్రారంభమయ్యాయి. కనీస వసతులు లేని అద్దె భవనాలు, గోదాములను కాలేజీలుగా ఎన్‌ఎంసీకి చూపించి, గత ప్రభుత్వం అనుమతులు తీసుకొచ్చింది. మెడికల్ కాలేజీల సంఖ్య ఉన్నట్టుండి 9 నుంచి 34కు పెరగడంతో ఫాకల్టీ కొరత, మౌలిక వసతుల కొరత విపరీతంగా ఏర్పడింది. ఈ సమస్యలను అధిగమించి కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లను అభివృద్ధి చేసుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రణాళిబద్ధంగా ముందుకెళ్తున్నదనీ, ఇందుకోసం జీవో 276 ద్వారా మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ)లను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు అన్ని కాలేజీలను సందర్శించి అనేక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తున్నాయి.

కమిటీ పరిశీలించిన అంశాలు:

*మౌలిక సదుపాయాలు: విద్యా సంస్థల్లో భౌతిక సౌకర్యాలు (తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఆటస్థలాలు మొదలైనవి) అభివృద్ధి మరియు నిర్వహణ.

*మానవ వనరులు: అధ్యాపకులు, సిబ్బంది నియామకం, శిక్షణ, మరియు వృత్తిపరమైన అభివృద్ధి కోసం వ్యూహాలు.

*అకడమిక్ & కరికులం సంసిద్ధత: పాఠ్యప్రణాళిక రూపకల్పన, బోధనా పద్ధతులు, మరియు విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి సంసిద్ధత.

*విద్యార్థి సంక్షేమం మరియు సౌకర్యాలు: విద్యార్థులకు వసతి, ఆరోగ్య సంరక్షణ, కౌన్సెలింగ్, మరియు ఇతర సౌకర్యాలు అందించడం.

*ఇతర కార్యకలాపాలు, ఆర్థిక అంశాలు: సంస్థ నిర్వహణ, బడ్జెట్ నిర్వహణ, ఆర్థిక వనరుల సమీకరణ మరియు సమర్థవంతమైన వినియోగం.

*డిజిటల్ వ్యవస్థ మరియు ఐటీ మౌలిక సదుపాయాలు: ఆన్‌లైన్ బోధన, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సాంకేతిక సదుపాయాల అభివృద్ధి. కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా ఆయా కాలేజీలు, హాస్పిటళ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.

కొత్త హాస్టల్స్, ఉస్మానియా నిర్మాణం

కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం కోసం పది సంవత్సరాలుగా జూడాలు, ఫాకల్టీ పోరాటాలు చేశారు. ఈ దశాబ్ద కాలపు ఆకాంక్షను నెరవేరుస్తూ, గోషామహల్‌లో కొత్త ఉస్మానియా హాస్పిటల్‌ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అలాగే, ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం సుమారు 127 కోట్ల రూపాయలతో, అత్యాధునిక వసతులతో హాస్టల్ బిల్డింగ్స్‌ నిర్మిస్తున్నది.ఇలా అన్నిరకాలుగా డాక్టర్ల ఆకాంక్షలను గౌరవిస్తూ, వారి ఆశయాలను నెరవేర్చే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ గారి నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ వైద్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Next Story