టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్పెషల్‌ క్లాసుల వేళల్లో స్నాక్స్ పంపిణీ

by Yella Dhawani Reddy |   (  Updated:2025-01-30 02:54:37  IST  )

రాష్ట్రంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది.

టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్పెషల్‌ క్లాసుల వేళల్లో స్నాక్స్ పంపిణీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తుంది. అయితే, విద్యార్థులు ఖాళీ కడుపుతో తరగతులు వినే పరిస్థితి నెలకొంటుడటంతో వారికి స్నాక్స్ అందించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

టెన్త్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం, సాయంత్రం సమయాల్లో విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అలాగే వారాంతంలో స్లిప్‌ టెస్ట్‌లు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దసరా తర్వాత నుంచే ఈ స్పెషల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. అయితే, మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం తింటే.. ప్రత్యేక తరగతులు పూర్తయి ఇళ్లకు వెళ్లేసరికి ఇతర గ్రామాల విద్యార్థులకు రాత్రి 7 గంటలవుతోంది. అప్పటి వరకు ఏమీ తినకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం స్పెషల్‌ క్లాసులకు ముందు ఆయా రోజుల్లో మెనూ ప్రకారం స్నాక్స్ అందించనున్నారు.

గతంలో పలు జిల్లాల్లో కలెక్టర్ల నిర్ణయం మేరకు సాయంత్రం పూట స్నాక్స్‌ అందించేవారు. అయితే తొలిసారి 2023లోనూ విద్యాశాఖే 'సమగ్ర శిక్ష' ద్వారా 34 రోజులపాటు వాటిని అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది మాత్రం ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన నేపథ్యంలో అమలు కాలేదు. ఈసారి మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20వ తేదీ మధ్య పాఠశాలలు నడిచే 38 రోజుల పాటు ఈ స్నాక్స్‌ను విద్యార్థులకు అందించనున్నారు.

విద్యార్ధులకు స్నాక్స్ అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున మంజూరు చేయనుంది. ఇక రాష్ట్రంలోని దాదాపు 4,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 194 మోడల్‌ స్కూళ్లలో సుమారు 1.90 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. అంటే 38 రోజులకు సుమారు రూ.11 కోట్ల బడ్జెట్‌ అవసరమని అంచనా వేశారు. ఇక విద్యార్థులకు స్నాక్స్‌గా ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు-బెల్లం, చిరుధాన్యాలతో చేసిన మిల్లెట్‌ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉల్లిపాయ పకోడి, ఉడకబెట్టిన శనగల్లో రోజుకు ఒక రకం ఇవ్వనున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీల మహిళలే వాటిని సరఫరా చేస్తారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story