24 గంటల్లోనే బంగారు బ్రేస్‌లెట్ రికవరీ.. KPHB పోలీసుల వేగవంతమైన చర్య

by Ramesh Naini |

నగరంలోని కేపీహెచ్‌బీ పరిధిలో ఉన్న నెక్సస్ మాల్‌లో బంగారు బ్రేస్‌లెట్ పోగొట్టుకున్న ఓ యువతికి పోలీసులు అండగా నిలిచారు.

24 గంటల్లోనే బంగారు బ్రేస్‌లెట్ రికవరీ.. KPHB పోలీసుల వేగవంతమైన చర్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలోని కేపీహెచ్‌బీ పరిధిలో ఉన్న నెక్సస్ మాల్‌లో బంగారు బ్రేస్‌లెట్ పోగొట్టుకున్న ఓ యువతికి పోలీసులు అండగా నిలిచారు. ఫిర్యాదు అందిన కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆ బ్రేస్‌లెట్‌ను ట్రేస్ చేసి, సురక్షితంగా బాధితురాలికి అందజేశారు. కేపీహెచ్‌బీ పోలీసుల వేగవంతమైన చర్య పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆదివారం ఎక్స్ వేదికగా సైబరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన జి. అఖిల (26) (తండ్రి: శ్రీనివాస్) ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఏప్రిల్ 23, 2026 రాత్రి సుమారు 10:10 గంటల సమయంలో ఆమె కేపీహెచ్‌బీలోని నెక్సస్ మాల్‌కు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు తన బంగారు బ్రేస్‌లెట్‌ను పోగొట్టుకున్నారు. వస్తువు పోయిన విషయాన్ని గమనించిన బాధితురాలు, మరుసటి రోజు (ఏప్రిల్ 24) మధ్యాహ్నం 01:00 గంటకు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీస్ బృందం

యువతి ఫిర్యాదు అందిన వెంటనే కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న ఎస్‌హెచ్ఓ (SHO) ఎస్. రాజశేఖర్ రెడ్డి, డీఐ (DI) కె.ఎస్. రవి నేతృత్వంలో.. క్రైమ్ టీమ్ సభ్యులు రఘు, సురేష్‌లతో కూడిన బృందం త్వరితగతిన విచారణ చేపట్టింది. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగి కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆ బ్రేస్‌లెట్‌ను ట్రేస్ చేసి, విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులకు బాధితురాలి కృతజ్ఞతలు

రికవరీ చేసిన బంగారు బ్రేస్‌లెట్‌ను పోలీసులు బాధితురాలు జి. అఖిల‌కి సురక్షితంగా అందజేశారు. ఆశ వదులుకున్న తన బ్రేస్‌లెట్ తిరిగి దొరకడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి, తన వస్తువును తిరిగి ఇచ్చిన కేపీహెచ్‌బీ పోలీసులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story