బోనమెత్తిన గోల్కొండ.. పోతురాజుల వీరంగం

by Bhanu |   (  Updated:2025-06-29 15:12:42  IST  )

గోల్కొండ కోటపై జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం భక్తుల సందడితో అంగరంగ వైభవంగా సాగింది. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారు.

బోనమెత్తిన గోల్కొండ.. పోతురాజుల వీరంగం
X

దిశ, కార్వాన్: గోల్కొండ కోటపై జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం భక్తుల సందడితో అంగరంగ వైభవంగా సాగింది. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. వెంకట్రావు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తూ, అధికారులకు సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్, నీటి వసతి, వైద్య శిబిరాలు, శుభ్రత చర్యలు అన్ని విభాగాల్లో సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. హెచ్ఎండిఏ ఏర్పాటు చేసిన తాగునీటి స్టాల్స్, మెడికల్ క్యాంపులు పరిశీలించిన ఆయన, వీటిని మరింత మెరుగుపరిచేందుకు ఆదేశాలు ఇచ్చారు.

వెచ్చటి ఆదివారం కావడంతో పెద్దఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. కోటపై అధిక భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా జాతరను నిరంతరం నిఘా ఉంచుతున్నారు. భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

జాతరకు హాజరైన అధికారులు.. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హరిచందన దాసరి, సీపీ సీవీ ఆనంద్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు.. అన్ని ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

విదేశీ భక్తుల సైతం పాల్గొనడం ఈ ఏడాది జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పీస్ కమిటీ సభ్యులు, పోలీస్ పాయింట్లు, అంబులెన్సులు, మెడికల్ క్యాంపులు, నీటి సదుపాయాలు, పారిశుద్ధ్య కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.


Next Story