- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలవరం-బనకచర్ల లింక్‌కు బ్రేకులు.. ప్రాజెక్టు కట్టాలంటే డీపీఆర్ చేంజ్ చేయాల్సిందే!
ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును మిగులు జలాలతో నిర్మిస్తారా? వరద జలాలతో నిర్మిస్తారా? అని క్లారిటీ ఇవ్వడం లేదని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును మిగులు జలాలతో నిర్మిస్తారా? వరద జలాలతో నిర్మిస్తారా? అని క్లారిటీ ఇవ్వడం లేదని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) తెలిపింది. బనకచర్ల నిర్మాణంపై పలు కీలక అభ్యంతరాలు తెలుపుతూ సీడబ్ల్యూసీకి జీఆర్ఎంబీ శుక్రవారం లేఖ రాసింది. పోలవరం నుంచి అదనంగా 200 టీఎంసీల వరద నీటిని బనకచర్లకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చాలా వరకు చట్టపరమైన, సాంకేతికంగా, అంతర్రాష్ట్ర ఒప్పందాల సమస్యలు ఉన్నాయని లేఖలో స్పష్టం చేశారు.
జీఆర్ఎంబీ చేసిన అభ్యంతరాలు
పోలవరం ప్రాజెక్టు డీపీఆర్ 2009 జనవరి 20న ఆమోదించబడింది. అయితే.. ఇప్పుడు అదనంగా 200 టీఎంసీల నీటిని మళ్లించాలనే ప్రతిపాదన తీసుకురావడంతో ఆ డీపీఆర్‌ను సవరించాలి. ఇందుకు జలవనరులు, నదుల అభివృద్ధి, డీఓడబ్ల్యూఆర్, ఆర్‌డీ, జీఆర్ సలహా కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అలాగే.. పోలవరం డ్యామ్ నుండి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించడం వల్ల 1980 గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ)లో భాగంగా ఉన్న 1980 ఏప్రిల్ 2 నాటి ఒప్పందం (అనుబంధం-జి)లోని ఆపరేషన్ షెడ్యూల్ మార్చాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆపరేషన్ షెడ్యూల్‌లో ఏవైనా మార్పులు ఉమ్మడి మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాత మాత్రమే చేయాల్సి ఉంటుంది అని ఆ లేఖలో పేర్కొంది. జీడబ్ల్యూడీటీ అవార్డులోని క్లాజ్ 7(ఎఫ్) ప్రకారం పోలవరం నుండి కృష్ణా నదిలోకి 80 టీఎంసీలకు మించి గోదావరి జలాలను మళ్లిస్తే, ఆ అదనపు నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలు 80 టీఎంసీల నీటిని పంచుకున్న నిష్పత్తిలోనే పంచుకోవాలి. అలాగే.. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ) తుది ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. సీడబ్ల్యూసీ ఈ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
నీటి కేటాయింపులపై స్పష్టత కరువు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం వారసత్వ రాష్ట్రాలకు నదీ జలాల కేటాయింపులపై ఇంతవరకు స్పష్టత లేదని జీఆర్ఎంబీ తెలిపింది. జీడబ్ల్యూడీటీ 1980 గోదావరి నది బేసిన్‌లో నీటి లభ్యతను లెక్కించలేదు. బేసిన్ రాష్ట్రాలకు పంపిణీ కూడా చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన గోదావరి నది నీరు వారసత్వ రాష్ట్రాల మధ్య ఏ ట్రైబ్యునల్ ద్వారా కానీ, ఏ పరస్పర ఒప్పందం ద్వారా కానీ పంపిణీ చేయలేదని తెలిపింది. బనకచర్లపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్‌లో కొత్త ఆయకట్టు.. ప్రాజెక్టు అంచనా వ్యయం చేర్చలేదని పేర్కొంది. ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని లెక్కించేటప్పుడు డీపీఆర్‌లో ప్రాజెక్టులోని అన్ని భాగాలను చేర్చాలని జీఆర్ఎంబీ స్పష్టం చేసింది. గోదావరి బేసిన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు లభించిన నీటి వాటాను విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏ ట్రిబ్యునల్ కేటాయించలేదు. ఇరు రాష్ట్రాల మధ్య దీనిపై ఎటువంటి ఒప్పందం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ ఏకపక్షంగా ఇంత భారీ నీటిని తరలించడం వివాదాలకు దారితీస్తుందని, ఈ కీలక విషయాన్ని సీడబ్ల్యూసీ గమనించాలని జీఆర్‌ఎంబీ పేర్కొంది.






