హైదరాబాద్ వేదికగా ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్‌స్టిట్యూషన్’ సదస్సు

by Ajay Maddhiboyina |

టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం (టీ-చిప్) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27 నుంచి 28 వరకు హైదరాబాద్ నగరంలో టీ-చిప్ సెమీకాన్ రాజ్యాంగ సదస్సు 2025 నిర్వహించనున్నారు. సెమీకండక్టర్ రంగానికి ఈ సదస్సు చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు, విద్యా, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సులో భాగస్వాములుకానున్నారు.

హైదరాబాద్ వేదికగా ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్‌స్టిట్యూషన్’ సదస్సు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం (టీ-చిప్) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27 నుంచి 28 వరకు హైదరాబాద్ నగరంలో టీ-చిప్ సెమీకాన్ రాజ్యాంగ సదస్సు 2025 నిర్వహించనున్నారు. సెమీకండక్టర్ రంగానికి ఈ సదస్సు చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు, విద్యా, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సులో భాగస్వాములుకానున్నారు. ఈ సదస్సు ద్వారా ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్‌స్టిట్యూషన్’ మార్గసూచక రాజ్యాంగం రూపుదిద్దుకోనుంది. ఈ సదస్సు సాధారణంగా నిర్వహించే సాంకేతిక సమావేశం కాదని, భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన దిశను నిర్దేశించేందుకు తీసుకున్న కీలక ప్రయత్నమని నిర్వాహకులు తెలిపారు. టాలెంట్, డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, అప్లికేషన్స్ అనే నాలుగు ముఖ్యమైన అంశాలపై ఆధారపడిన టీ-చిప్ వ్యూహం ఆధారంగా ఇది సెమీకండక్టర్ ఆలోచన విధానానికి ప్రతి ఘట్టాన్ని అభివృద్ధి చేసే దిశగా ఒక రోడ్‌మ్యాప్‌గా పనిచేయనుంది. రెండు రోజుల సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి కీలక అధికారులతోపాటు ఎలక్ట్రానిక్స్, విద్య, రక్షణ రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.

రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ప్రధాన యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల విభాగాధిపతులు, ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) డైరెక్టర్ డా.కె.జి.విశ్వనాథన్, క్వాంటం టెక్నాలజీస్ డైరెక్టర్ చెల్లె వెంకట రామరాజు తదితరులు పాల్గొంటారు. అంతర్జాతీయ స్థాయిలో తైవాన్‌కు చెందిన నేషనల్ యాంగ్ మింగ్ చియో టంగ్ యూనివర్శిటీ (ఎన్‌వైసీయు), తైవాన్ సెమీకండక్టర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (టీఎస్ఆర్ఐ), ఏఆర్ఎం, జియుఎస్ టెక్నాలజీ సంస్థల ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారు. గస్ టెక్నాలజీ సీఈఓ సీసీ ఛాంగ్ ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. ఈ సదస్సులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన స్వదేశీ చిప్‌ను మొట్టమొదటిసారిగా ప్రజలకు పరిచయం చేయనున్నారు. ఇది భారతదేశం సెమీకండక్టర్ రంగంలో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో ఒక మైలురాయి కానుంది. సదస్సులో సెమీకండక్టర్ రంగంపై అనుభవజ్ఞుల ‘టి చిప్’​, వివిధ సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలపై సంతకాలు​ జరగనున్నాయి. చివరగా జరిగే నెట్‌వర్కింగ్ డిన్నర్‌లో సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ప్రముఖులు భవిష్యత్తు సహకార మార్గాలపై చర్చించనున్నట్లు టీ చిప్ చైర్మన్ సందీప్‌కుమార్ మక్తాలా తెలిపారు. పాల్గొనాలనుకునే వారు tinyurl.com/t-semicon వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని.. లేదంటే +91 80199 77575 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.

Next Story