ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలదే హవా.. మార్కులపై సందేహమా? రీకౌంటింగ్‌కు ఛాన్స్

by Ramesh Naini |

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో బాలికలే అత్యుత్తమ ఉత్తీర్ణత శాతంతో పైచేయి సాధించారు.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలదే హవా.. మార్కులపై సందేహమా? రీకౌంటింగ్‌కు ఛాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో బాలికలే అత్యుత్తమ ఉత్తీర్ణత శాతంతో పైచేయి సాధించారు. జనరల్, ఒకేషనల్ విభాగాలు కలిపి ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 76.10 శాతం, బాలురు 62.57 శాతం పాస్ కాగా, సెకండియర్ లో బాలికలు 52.56 శాతం, బాలురు 47.45 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ వెల్లడించారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 3,98,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 889 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు మే 13 నుండి మే 21 వరకు జరిగాయి. మే 22 నుంచి 25 వరకు 33 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయి. అలాగే 17 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో జనరల్, ఒకేషనల్ విభాగాల్లో కలిపి మొత్తం 2,67,331 మంది పరీక్షలు రాయగా, 1,84,042 మంది (68.84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్ లో జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 1,31,128 మంది పరీక్షలకు హాజరుకాగా 64,639 మంది (49.29) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ ఫలితాల్లో 80.38 శాతంతో ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్ల74.37 శాతంలో చివరి స్థానంలో నిలిచింది.

జూన్ 18 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు అవకాశం:

విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం నేటి నుండి ఈ నెల 18 వరకు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్‌కు పేపర్‌కు రూ. 100, రీవెరిఫికేషన్, స్కాన్డ్ కాపీకి పేపర్‌కు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షల ఒత్తిడి, ఆందోళన నుండి విద్యార్థులను దూరం చేయడానికి ఇంటర్ బోర్డు కౌన్సెలర్లను నియమించింది. అలాగే టెలి-మానస్ ఆధ్వర్యంలో సైకాలజిస్టులు, సైకియాట్రిస్టుల సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనైతే ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 14416 కి లేదా హెల్ప్ డెస్క్ నెంబర్ 9240205555 కి కాల్ చేయవచ్చని తెలిపారు.

Next Story