- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మాయిలూ.. జాగ్రత్త! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!! సజ్జనార్ హెచ్చరిక
పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదాలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అమ్మాయిలను అప్రమత్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదాలపై సోమవారం ఎక్స్ వేదికగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అమ్మాయిలను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ ట్వీట్ చేస్తూ.. ‘హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి’ అని తెలిపారు.
మోసం జరుగుతున్న తీరు ఇదీ..
ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై ఎంగేజ్‌మెంట్ జరిపించుకుంటున్నారని తెలిపారు. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులకు దగ్గరవుతున్నారని, ఎలాగూ పెళ్ళే కదా.. ఇప్పుడైతే ఏంటి? అని మాయమాటలు చెప్పి, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, ఒత్తిడితో శారీరకంగా లోబచుకుంటున్నారని ఆయన ట్వీట్ పేర్కొన్నారు. తీరా తమ కోరిక తీరాక అసలు రంగు బయటపెడుతున్నారు.. పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారని, లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. నిశ్చితార్థం జరిగిపోవడం, బంధుమిత్రులందరికీ తెలిసిపోవడంతో.. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే సమాజంలో తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో చాలా మంది యువతులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారని వెల్లడించారు. ఇదే అదునుగా భావిస్తున్న కేటుగాళ్ళు, అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారని సూచించారు. పరువు పోతుంది అని భయపడి మౌనంగా ఉంటే, జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. నిశ్చితార్థం అయినా సరే, పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచించారు.
పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా..
పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు అని సూచించారు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయాలన్నారు. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించాలని, ధైర్యంగా తిరస్కరించాలని సూచించారు. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా భయపడొద్దని, ఫిర్యాదు చేయండని సూచనలు చేశారు. మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు ఎలాంటి భయం లేకుండా ముందుకు రావాలి.. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు గానీ, డయల్ 100 కు గానీ కాల్ చేయండి.. అని సజ్జనార్ సూచించారు.






