- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుది దశకు వార్డుల డీలిమిటేషన్.. అభ్యంతరాలపై కసరత్తు
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో 27పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిని 300 వార్డులు చేస్తూ ఈనెల 9వ తేదిన జీహెచ్ఎంసీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన 10వ తేదీ నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని నిర్ణయించగా.. శుక్రవారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు కూడా ముగిసింది. 6వేలకుపైగా అభ్యంతరాలు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతోపాటు ఈనెల 16న నిర్వహించిన స్పెషల్ జనరల్ బాడీ సమావేశంలోనూ రాజకీయ పార్టీలకతీతంగా ఎక్స్‌అఫిషియో సభ్యులతోపాటు కార్పొరేటర్లు సైతం తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటు పార్టీల నుంచి అటు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ అభ్యంతరాలను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్, మరో ఇద్దరు అదనపు కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్‌లతో నియమించిన కమిటీ పరిశీలించి పరిష్కరించాలని నిర్ణయించారు.
రెండు రోజుల్లో ఫైనల్ నోటిఫికేషన్..
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై వచ్చిన 6వేలకుపైగా అభ్యంతరాల్లో వార్డుల పేర్ల మార్పులు, జనాభా వ్యత్యాసాలు, మ్యాపులు ఇవ్వాలని ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే సర్కిల్, జోన్లు, హెడ్ స్థాయిలో వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. చట్టం ప్రకారం వివాదాస్పదం కాకుండా ఉండే పేర్లను మార్చాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. దీంతోపాటు జనరల్ బాడీ సమావేశంలో కార్పొరేటర్లు లేవనెత్తిన జనాభా వ్యత్యాసాలను సైతం మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. 1.30 కోట్ల జనాభా అంటే 300 వార్డులకుగాను సుమారు 45వేలు వచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 10శాతం ఎక్కువ, తక్కువలు ఉండేవిధంగా చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారానికి చెందిన రిపోర్టును ప్రభుత్వానికి పంపించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముంది. ఈ ఫైనల్ నోటిఫికేషన్ శనివారం లేదా సోమవారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది.






