వార్డుల విలీనంపై ఆందోళన.. సరిహద్దులు ఎక్కడ?

by Naga Rani Yarlagadda |

జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో పాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్)పరిధిని 300 వార్డులుగా..

వార్డుల విలీనంపై ఆందోళన.. సరిహద్దులు ఎక్కడ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో పాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్)పరిధిని 300 వార్డులుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్విభజించిన విషయం తెలిసిందే. మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. దీనికి సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. చట్టం ప్రకారమే వార్డుల పునర్విభజన చేశామని అధికారులు చెబుతుండగా.. పునర్విభజనపై అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వార్డుల సరిహద్దుల విషయంలో అయోమయం నెలకొన్నదని రాజకీయ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే వార్డులకు సంబంధించిన ఖచ్చితమైన మ్యాపులను విడుదల చేయకపోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడుతున్నారు. కాగా, వార్డుల మ్యాపులను మాత్రం ఇప్పుడే బహిర్గతపర్చేదిలేదని అధికారులు చెబుతున్నారు.

పాత జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 97 వార్డులు..

జీహెచ్ఎంసీలో 27 యూఎల్బీల విలీనానికి ముందు 150 వార్డులు ఉండేవి. ఇందులోని జనాభాలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. తాజాగా వీటిని 150 నుంచి 247 వార్డులకు పెంచారు. అనగా కొత్తగా 97 ఏర్పాటు చేశారు. ఒక్కో దాంట్లో సుమారు 40 వేల జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేశామని, 10 శాతం ఎక్కువ, తక్కువ ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ, పాత 150 వార్డుల్లో, కొత్త చేరిన 97 వార్డుల్లో ఎటువంటి మార్పులు చేయలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బంజారాహిల్స్‌ను యథావిధిగా ఉంచారని పలు రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు. దీంతో పాటు బోరబండలో ఇప్పటికే జనాభా ఎక్కువగా ఉండడంతో కొత్తగా కొన్ని ఏరియాలను విలీనం చేశారనే ఆరోపణలున్నాయి.

27 యూఎల్బీల్లో 53 కొత్త వార్డులు

జీహెచ్ఎంసీలో విలీనమైన 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్లో 53 కొత్త వార్డులను విభజించారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బండ్లగూడ జాగీర్, కిస్మత్ పూర్, హైదర్ షా కోట్ ఇలా 3 వార్డులుగా విభజించారు. నార్సింగి మున్సిపాలిటీని నార్సింగి, గండిపేట్, కోకాపేట్ మూడు వార్డులుగా చేశారు. మణికొండ మున్సిపాలిటీని మణికొండ, నెక్నాంపూర్ వార్డులుగాను.. జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఒకే వార్డుగా విభజించారు. దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీలను ఒక్కో వార్డుగానే చేశారు. ఘట్కేసర్ మున్సిపాలిటీని ఘట్‌కేసర్, ఏదులాబాద్ వార్డులుగా డివైడ్ చేశారు. పోచారం మున్సిపాలిటీని ఒకే వార్డుగా చేశారు. ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌ను మేడిపల్లి, ఫీర్జాదిగూడ వార్డులుగా విభజించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బోడుప్పల్, చెంగిచెర్ల వార్డులుగా చేశారు. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీని కుంట్లూరు, పెద్ద అంబర్పేట్ వార్డులుగాను, తుర్కయంజాల్ మున్సిపాలిటీని తొర్రూర్, తుర్కయంజాల్ వార్డులు గాను, ఆదిభట్ల మున్సిపాలిటీని కొంగర కలాన్, ఆదిభట్ల వార్డులుగా చేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బడంగ్ పేట్, నాదర్ గుల్, ప్రశాంతిహిల్స్ వార్డులు, మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌ను జిల్లెలగూడ మీర్పేట్, బాలాపూర్ వార్డులుగా విభజించారు. శంషాబాద్ మున్సిపాలిటీని కొత్వాల్ గూడ, శంషాబాద్, అమీన్ పూర్ మున్సిపాలిటీని అమీన్ పూర్, సుల్తాన్ పూర్.. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌ను నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, బండారి లేఅవుట్ వార్డులుగా చేశారు. మిగిలిన మున్సిపాలిటీలను ఒక్కో వార్డుగా విభజించారు.

పాతబస్తీలో 70కి పైగా..

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లీస్ పార్టీదే హవా. వీటితో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలు కలిపి గతంలో 55 వార్డులు ఉండేవి. వీటిలో 45 వార్డుల్లో మజ్లీస్ పక్కాగా గెలిచేది. వార్డుల పునర్విభజనలో భాగంగా పాతబస్తీలో వాటి సంఖ్య 70కి పైగా పెరిగింది. ఈ క్రమంలోనే వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంటూ అక్బరుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు జీఎచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌ను కలిశారు.

రాజకీయ పార్టీల అభ్యంతరం..

జీహెచ్ఎంసీ పరిధిని 300 వార్డులకు పెంచడంతో పునర్విభజనపై అన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే బుధవారం కమిషనర్‌ను మజ్లీస్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం బీజేపీ నాయకులు సైతం తమ అభ్యంతరాలను వివరించనున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే న్యాయపోరాటం చేయాలని బీజేపీ నేతలు యోచిస్తున్నట్టు సమాచారం.

16న కౌన్సిల్ సమావేశం..

వార్డుల పునర్విభజనపై జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో చర్చించనున్నారు. ఈ విషయంపై మేయర్ విజయలక్ష్మితో కమిషనర్ ఆర్వీ కర్ణన్ బుధవారం గంటపాటు చర్చించారు. బడ్జెట్ అంశాలపైనా చర్చించినట్టు సమాచారం. వార్డుల పునర్విభజనపై జీహెచ్ఎంసీ అభ్యంతరాలు స్వీకరించాలని బుధవారం నిర్ణయించింది. మొదటి రోజే 40 అభ్యంతరాలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా, నిన్నటి నుంచి 7 రోజుల పాటు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి వాటిని పరిష్కరించిన తర్వాత ప్రభుత్వానికి నివేదికను పంపించనున్నారు. చివరగా రాష్ట్ర ప్రభుత్వం వార్డుల సరిహద్దులను సమీక్షించి రాజకీయ పార్టీల అభ్యంతరాలను క్లియర్ చేశాకే వార్డుల పునర్విభజనకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తున్నది.

Next Story