- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాపర్టీ, ట్రేడ్ లైసెన్స్‌లపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్
ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంచుకోవడానికి జీహెచ్ఎంసీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చెల్లిస్తున్న భవనాల ఆస్తిపన్నును సమీక్షిస్తూనే అసలు చెల్లించని భవనాలపై దృష్టి సారించాలని నిర్ణయించింది.

దిశ, సిటీ బ్యూరో: ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంచుకోవడానికి జీహెచ్ఎంసీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చెల్లిస్తున్న భవనాల ఆస్తిపన్నును సమీక్షిస్తూనే అసలు చెల్లించని భవనాలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే గ్రేటర్‌లోని మాల్స్‌పై ఫోకస్ పెట్టింది. గ్రేటర్‌లోని మాల్స్ అసలు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నాయా? ప్రాపర్టీ చెల్లిస్తే ట్రేడ్ లైసెన్స్ ఉందా? లేదా? అనే అంశాలపై ఆరా తీయడం తో పాటు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి వారం రోజుల క్రితం జీహెచ్ఎంసీ సర్క్యూలర్ జారీ చేసింది. డిప్యూటీ కమిషనర్లు, టాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. మాల్స్ తర్వాత గ్రేటర్‌లోని స్టార్ హోటళ్లను తనిఖీలు చేయాలని నిర్ణయించారు.
200 మాల్స్‌కు నోటీసులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తిపన్ను సరిగ్గా చెల్లించడం లేదని, ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తున్నాయని జీహెచ్ఎంసీ గుర్తించింది. కొన్ని మాల్స్ తక్కువ విస్తీర్ణం చూపించి ట్యాక్స్ తక్కువ చెల్లిస్తున్నట్టు గుర్తించారు. పెద్ద పెద్ద మాల్స్ సరైన విధంగా ఆస్తి పన్ను చెల్లిస్తున్నాయా? కమర్షియల్, రెసిడెన్షియల్‌తో పాటు చేస్తున్న వ్యాపారానికి తగిన ట్రేడ్ లైసెన్సులు తీసుకున్నాయా? లేదా అన్న దానిపై అధికారులు ఫోకస్ పెట్టారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 300 వరకు మాల్స్ ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో ఈ నెల 8వ తేదీ నుంచి సోమవారం వరకు 200 మాల్స్‌ను గుర్తించి, నోటీసులు జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. నోటీసులు అందుకున్న వాటిలో జీవీకే, సీఎంఆర్, ఫోరం మాల్స్, హైదరాబాద్ సెంట్రల్ మాల్, ఐకియా వంటి పెద్ద మాల్స్ ఉన్నట్లు తెలిసింది. మిగతా వాటికి మంగళవారం నోటీసులు జారీ చేయనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మాల్స్‌ను మాత్రం ఈ డ్రైవ్‌లో భాగంగా నోటీసుల జారీ ప్రక్రియ నుంచి మినహాయించారు. వచ్చే నెల 14న కోడ్ ముగిసిన తర్వాత ఈ పరిధిలోని మాల్స్‌కు నోటీసులు జారీ చేయనున్నారు.
రెడ్ నోటీసులు, సీజ్ చేయడమే
జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం మాల్స్ సరిగ్గానే ఆస్తిపన్ను చెల్లిస్తున్నాయా? ట్రేడ్ లైసెన్స్ తీసుకుని వ్యాపార లావాదేవీలు చేస్తున్నాయా? అనే కోణంలో అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసుల తర్వాత యజమానుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలకు ఉపక్రమించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే మాల్స్ చెల్లిస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్‌ను రెసిడెన్షయల్ పరిధిలో గనుక ఉంటే ముందుగా కమర్షియల్ కిందకు మార్చనున్నారు. అలాగే మాల్‌లో ఎంతమంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారని గుర్తించి అందరి నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజును పక్కాగా వసూలు చేయనున్నారు.
ఈ మేరకు ముందుగా మాల్స్‌కు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులకు స్పందించని యాజమాన్యాలను గుర్తించి రెడ్ నోటీసులు జారీ చేయనున్నారు. అయినా స్పందించకపోతే సీజ్ చేయడమే తరువాయని అధికారులు చెబుతున్నారు. నగరంలో ఏ ఒక్క మాల్ కూడా సరైన ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడం లేదని అధికారులు గుర్తించారు. అందరి నుంచి పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత స్టార్ హోటల్స్‌ను లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.






