‘రియల్’ సంస్థలకు కొమ్ముకాస్తున్న GHMC అధికారులు.. ఎన్వోసీలు లేకున్నా పర్మిషన్లు!

by Kema Shiva Kumar |

‘బీఆర్ఎస్ ప్రభుత్వ త‌ర‌హాలో మేము కొందరు బిల్డర్లకు స్పెష‌ల్ ట్రీట్‌మెంట్ ఇవ్వలేం’ ఇటీవల క్రెడాయ్ హైద‌రాబాద్ ప్రాప‌ర్టీ షోలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలివి.

‘రియల్’ సంస్థలకు కొమ్ముకాస్తున్న GHMC అధికారులు..  ఎన్వోసీలు లేకున్నా పర్మిషన్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘బీఆర్ఎస్ ప్రభుత్వ త‌ర‌హాలో మేము కొందరు బిల్డర్లకు స్పెష‌ల్ ట్రీట్‌మెంట్ ఇవ్వలేం’ ఇటీవల క్రెడాయ్ హైద‌రాబాద్ ప్రాప‌ర్టీ షోలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలివి. కానీ జీహెచ్ఎంసీ అధికారులు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కంపెనీలపై వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే హైటెక్ సిటీకి సమీపంలో నమితా హోమ్స్ నిర్మిస్తున్న 360 లైఫ్ ప్రాజెక్టు. అగ్నిమాప‌క శాఖ, పౌర‌ విమాన‌యాన శాఖ నుంచి ఎన్ఓసీలు లేకున్నా.. ఈ 25 అంత‌స్తుల అపార్టుమెంట్‌కు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించారని, అనేక లోపాలు ఉన్నాయని సమాచారం. అయితే న‌మితా హోమ్స్ ఇచ్చే కాసుల‌కు కక్కుర్తిప‌డే జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అనుమతులు జారీ చేసినట్లు రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

పనులు నిలిపివేత.. రీ పర్మిషన్

హైటెక్ ‌సిటీ చేరువ‌లో న‌మితా హోమ్స్ 360 లైఫ్ ప్రాజెక్టు పేరిట 25 అంత‌స్తుల అపార్ట్ మెంట్ నిర్మిస్తున్నది. అయితే ఇందులో పలు లోపాలు గుర్తించి 2025 మే నెలలో జీహెచ్ఎంసీ అధికారులు పనులను నిలిపివేశారు. అయితే నెల రోజుల్లో మళ్లీ పర్మిషన్స్ ఇచ్చారు. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు తెలంగాణ హైకోర్టులో కేసు దాఖ‌లు చేశారు.

హైకోర్టు ఆగ్రహం.. స్టే..

హైటెక్ సిటీ చేరువ‌లో ఫైర్ డిపార్టుమెంట్, విమానయానశాఖ ఎన్వోసీ లేకుండా, అక్రమంగా అద‌న‌పు అంత‌స్తుల్ని నిర్మిస్తుంటే జీహెచ్ఎంసీ ఆ నిర్మాణాన్ని నిలిపి వేయ‌కుండా ఏం చేస్తున్నదని తెలంగాణ హై కోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేసింది. ప్రాజెక్టులోని అక్రమాలను సరి చేయకుండా నెల రోజుల్లోనే మళ్లీ అనుమ‌తులను జారీ చేయడం ఏమిటని జీహెచ్ఎంసీని నిల‌దీసింది. ఈ నిర్మాణంలో సుమారు ప‌ద్దెనిమిది లోపాల‌ను గ‌మ‌నించినా.. జీహెచ్ఎంసీ వాటిని స‌రిదిద్దకుండా తిరిగి అనుమ‌తిని ఎలా మంజూరు చేసిందంటూ ప్రశ్నించింది. అయితే ఒక‌వేళ నిర్మాణ లోపాల్ని స‌వ‌రించ‌క‌పోతే, ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ జారీ చేసేట‌ప్పుడు త‌గిన చ‌ర్యల్ని తీసుకుంటామ‌ని జీహెచ్ఎంసీ హై కోర్టుకు సమాధానమిచ్చింది. దీనిపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. అలాంటి చ‌ర్యల వ‌ల్ల అక్రమ నిర్మాణాల్ని ప్రోత్సహించిన‌ట్లు అవుతుంద‌ని స్పష్టం చేసింది. ముందుగా జారీ చేసిన నిర్మాణం నిలిపివేయమనే ఆదేశం గురించి.. రీవాలిడేషన్ లేఖలో ఒక్కసారి కూడా ఎందుకు ప్రస్తావించలేద‌ని ప్రత్యేకంగా ప్రశ్నించింది. ఈ మొత్తం నిర్మాణంపై స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. మ‌రి ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్న వారి ప‌రిస్థితి ఏమిటో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఈ టాపిక్ పై జోరుగా చర్చ నడుస్తున్నది.

Next Story