GHMC: బల్దియా పరిధిలో రోడ్ల నిర్వహణ యమ కాస్ట్లీ.. కి.మీ. రోడ్డుకు రూ.3.34 కోట్లు

by Kema Shiva Kumar |

జీహెచ్ఎంసీ రోడ్ల నిర్వహణ చాలా ఖరీదుగా మారింది.

GHMC: బల్దియా పరిధిలో రోడ్ల నిర్వహణ యమ కాస్ట్లీ.. కి.మీ. రోడ్డుకు రూ.3.34 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ రోడ్ల నిర్వహణ చాలా ఖరీదుగా మారింది. రోడ్ల నిర్వహణ ఖర్చును బల్దియా అమాంతం పెంచేసింది. ఏకంగా డబుల్ చేసింది. మొదటి దశ సీఆర్ఎంపీలో కి.మీ. రోడ్డుకు రూ.1.85 కోట్లు ఉంటే కొత్త ప్రతిపాదనల్లో రూ.3.34 కోట్లు చేసింది. గతంలో రూ.1,839 కోట్లు అంచనాలు తయారు చేసి రూ.1,500 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. ఈసారి అంతర్గత రోడ్లను కూడా కలిపి సీఆర్ఎంపీ అంచనాలు పెంచారు. నిబంధనల ప్రకారం అయితే గతంలో ఖర్చు చేసిన నిధుల ఆధారంగా ప్రతిపాదనలు తయారు చేయాల్సి ఉంటుందని పలువురు ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఏజెన్సీల కోసమే కొత్తగా ప్రతిపాదనలు తయారు చేశారనే విమర్శలూ లేకపోలేదు.

గ్రేటర్ పరిధిలో 9,013 కి.మీ.రోడ్లు..

జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కి.మీ. రోడ్లు ఉన్నాయి. వీటిలో 2,846 కి.మీ. బ్లాక్‌టాప్ (బీటీ) రోడ్లు, 6,167 కి.మీ. సిమెంట్ రోడ్లు(సీసీరోడ్లు) కలవు. ఈ రోడ్లలో 526 కి.మీ. రోడ్లు 4 లైన్లు, ఆ పైన లైన్ల రోడ్లు కలవు. ఈ నేపథ్యంలో 9,013 కి.మీ. ప్రధాన బీటీ రోడ్లలో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) పథకం ద్వారా 810 కి.మీ. ప్రజారవాణా మెరుగుపడే ప్రధాన రోడ్డును రూ.1,839 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ పరిధిలో 2019లో సీఆర్ఎంపీ స్కీమ్ ద్వారా 709.49 కి.మీ. ప్రజారవాణా మెరుగుపడే ప్రధాన రోడ్లను ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించారు. ఈ రోడ్ల నిర్మాణం 3 లేన్ల, ఎక్కువ వెడల్పు గల రోడ్లను 7 ప్యాకేజీలో 401 స్ట్రెచెస్ ఐదేండ్లు నిర్వహణ చేసే విధంగా ఏజెన్సీలకు కేటాయించారు. ఈ ఏజెన్సీలు ఫుట్‌పాత్, సెంట్రల్ డివైడర్లు, నిర్మాణాలు, కర్బ్ పెయింటింగ్, లేన్ మార్కింగ్, గ్రీనరి మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది. కానీ రోడ్ల రీకార్పెంటింగ్ తప్ప నిర్వహణను గాలికొదిలేశారు. ఫుట్‌పాత్‌ల నిర్వహణ అసలే చేయలేదు.

ఫస్ట్ ఫేజ్‌లో కి.మీ.కు రూ.1.85 కోట్లు

రూ.1,839 కోట్ల అంచనా వ్యయంతో 709 కి.మీ. రోడ్లను చేపట్టేందుకు ప్రతిపాదించారు. తర్వాత 748 కి.మీ.కు చేరింది. అనంతరం నిధులు మిగిలే అవకాశముందని గుర్తించిన ఆఫీసర్లు కొన్ని రోడ్లను గుర్తించి 810 కి.మీ. వరకు సీఆర్ఎంపీలో చేర్చారు. అయితే, రూ.1,839 కోట్లల్లో 80 % లోన్ (రూ.1450 కోట్లు), 20 % జీహెచ్ఎంసీ నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు. లోన్ నుంచి రూ.1,300 కోట్లు ఖర్చు చేశారు. జీహెచ్ఎంసీ నిధుల నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం రూ.1,839 కోట్లల్లో రూ.1,500 కోట్లు ఖర్చు చేసినట్టు ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఒక కి.మీ.కు రూ.1.85 కోట్లు ఖర్చయిందని అధికారిక లెక్కలే చెబుతున్నారు. దీంతో పాటు 2022-23లో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మరో 400 కి.మీ.ను కూడా సీఆర్ఎంపీలో చేర్చడంతో పాటు రూ.700 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.

కి.మీ. తగ్గినా నిధులు అంచనాలు పెంపు

మొదటి దశలో 810 కి.మీ. రోడ్లకుగాను రూ.1,839 కోట్లు అవుతుందని అంచనా వేసిన అధికారులు రెండో దశలో మాత్రం 744.22 కి.మీ. రోడ్ల నిర్వహణ కోసం రూ.2,491 కోట్లు అవుతుందని అంచనా వేశారు. గతం కంటే కిలోమీటర్లు తగ్గినా నిధులు మాత్రం రూ.652 కోట్లు పెంచారు. దీంతో పాటు కొత్తగా గుర్తించిన 398.32 కి.మీ.కు రూ.1,334 కోట్లు అవుతుందని అంచనాలు తయారుచేశారు. కానీ ఇదే రోడ్లకు 2022-23లో రూ.700 కోట్లు అవుతుందని ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించారు. పాతవి, కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తే ఏకంగా రూ.1,286 కోట్లు పెంచారు. పాతవి, కొత్తవి కలిపి 1142.54 కి.మీ.కుగాను రూ.3,825 కోట్లు అవుతుందని అధికారులు అంచనాలు తయారుచేశారు. అంటే ఒక్కో కి.మీ.కు రూ.3.34 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.

రిటైర్డ్ ఇంజినీర్ అంచనా కి.మీ.కు రూ.1.50 కోట్లు

రోడ్ల నిర్వహణ మూడు రకాలుగా ఉంటుంది. వాటిలో ముఖ్యంగా వీజీ40, సీఎంబీ, పీఎంబీ. జీహెచ్ఎంసీ పరిధిలో వీజీ40 మోడల్‌ను వినియోగిస్తున్నారు. వీజీ40 బిటుమిన్ వినియోగిస్తే నాలుగు లేన్లు, 15 మీటర్ల వెడల్పు కల్గిన కి.మీ. రోడ్డుకు రూ.50 లక్షలు ఖర్చవడంతో పాటు ఏడాదిన్నరపాటు రోడ్డేయాల్సిన అవసరం రాదు. ఐదేండ్ల కాలంలో మూడు సార్లు రోడ్డు వేసినా రూ.1.50 కోట్లు అవుతుంది. ఈ లెక్కన 1,142 కి.మీ.కు రూ.1,700కోట్లకుపైగా మాత్రమే అవుతుంది. సీఎంబీ అయితే కి.మీ.కు కోటిరూపాయలు అవడంతోపాటు ఐదేండ్లు, పీఎంబీ అయితే కి.మీ.కు రూ.1.2 కోట్లు అవడంతోపాటు పదేండ్లపాటు నాణ్యత ఉంటుందని ఓ రిటైర్డ్ ఇంజినీర్ తెలిపారు.

పెనాల్టీలు, నోటీసులు

సీఆర్ఎంపీలో కొత్త రోడ్లేసిన కాంట్రాక్టర్లు నిర్వహణను గాలికొదిలేశారు. ఒప్పందం ప్రకారం ఈ ఏజెన్సీలు ఫుట్‌పాత్, సెంట్రల్ డివైడర్లు, నిర్మాణాలు, కర్బ్ పెయింటింగ్, లేన్ మార్కింగ్, గ్రీనరీ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది. కానీ ఎక్కడా అమలు చేయలేదు. ఫుట్‌పాత్‌లను అసలే పట్టించుకోలేదు. వర్షాకాలంలో అయితే మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లను ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. వీటికి జీహెచ్ఎంసీ అదనంగా నిధులు ఖర్చు చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన కాంట్రాక్టు ఏజెన్సీలపై అసంతృప్తి వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ లక్షల రూపాయలు పెనాల్టీలు వేసింది. పలు ఏజెన్సీలకు నోటీసులు కూడా జారీచేసింది. ఇక సీఆర్ఎంపీ రోడ్లల్లో స్వీపింగ్ మెషిన్లు తిరగడమే తప్పా ఎక్కడా క్లీన్ చేసిన దాఖలాల్లేవు. వీటిపై బల్దియాకు పలుమార్లు ఫిర్యాదులొచ్చిన అధికారులు పట్టించుకోలేదని పలువురు కార్పొరేటర్లు చెబుతున్నారు. ఈ సారి రెండు లేన్లు, ఆరు మీటర్ల వెడల్పు కల్గిన అంతర్గత రోడ్లను సైతం సీఆర్ఎంపీలో చేర్చినట్టు తెలిసింది. కొత్తగా మేజర్ రోడ్ల మార్గాల్లో అవసరమైన చోట కొత్తగా వరదనీటి కాలువను నిర్మించడంతో పాటు ఉన్నవాటి నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించాలని ప్రతిపాదించారు. ఫుట్‌పాత్‌లను కట్టలేని వాళ్లు వరద నీటి కాలువను ఎలా నిర్మిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కాంట్రాక్టర్ల కనుసన్నల్లోనే..

సీఆర్ఎంపీ రోడ్ల గుర్తింపు, అంచనాలు, ప్రతిపాదనలు బడా కాంట్రాక్టర్ల కనుసన్నల్లోనే జరిగిందని పలువురు కార్పొరేటర్లు, ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రూ.3,825 కోట్లను కొల్లగొట్టేందుకు భారీ ప్రణాళిక రూపొందించారనే విమర్శలూ లేకపోలేదు. సీఆర్ఎంపీ ప్రతిపాదనలపై బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడుతున్నారు.

నేడు స్టాండింగ్ కమిటీ ముందుకు

రూ.3,825 కోట్లతో 1,142 కి.మీ. సీఆర్ఎంపీ ప్రతిపాదనలను గురువారం మేయర్ అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ కమిటీలో బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లు ఉండటంతో ఈ ఎజెండాపై సీనియస్‌గానే చర్చ జరిగే అవకాశముందని పలువురు సభ్యులు చెబుతున్నారు. ఒక వేళ బడ్జెట్ ప్రతిపాదనల తరహాలో ఈ ఎజెండాను కూడా తిరస్కరిస్తే ఏం జరుగుతుందో చూడాల్సిందే.

ఇప్పటికే ఉన్నవి

జోన్ - స్ట్రెచ్చ్స్ - కి.మీ - రూ.కోట్లల్లో

ఎల్బీనగర్ - 79 - 140.18 - 420

చార్మినార్ - 93 - 132.52 - 402

ఖైరతాబాద్-1- 88 - 86.84 - 343

ఖైరతాబాద్-2- 72 - 78.87 - 326

శేరిలింగంపల్లి- 48 - 90.46 - 258

కూకట్‌పల్లి - 32 - 86.74 - 340

సికింద్రాబాద్ - 98 - 128.61 - 402

మొత్తం -510 - 744.22 - 2491

కొత్త ప్రతిపాదనలు

జోన్ - స్ట్రెచ్చ్స్ - కి.మీ - రూ.కోట్లల్లో

ఎల్బీనగర్ - 85 - 80.89 - 254

చార్మినార్ - 68 - 58.52 - 150

ఖైరతాబాద్-1- 44 - 34.37 - 93

ఖైరతాబాద్-2- 50 - 35.83 - 102

శేరిలింగం పల్లి- 87 - 84.51 - 291

కూకట్‌పల్లి - 45 - 74 - 329

సికింద్రాబాద్ - 45 - 30.20 - 115

మొత్తం - 424 - 398.32 - 1334

మొత్తం ప్రతిపాదనలు

జోన్ - స్ట్రెచ్చ్స్ - కి.మీ - రూ.కోట్లల్లో

ఎల్బీనగర్ - 164 - 221.07 - 674

చార్మినార్ - 161 - 191.04 - 552

ఖైరతాబాద్-1- 132 - 121.21 - 436

ఖైరతాబాద్-2- 122 - 114.70 - 428

శేరిలింగం‌పల్లి- 135 - 174.97 - 549

కూకట్‌పల్లి - 77 - 160.74 - 669

సికింద్రాబాద్ - 143 - 158.81 - 517

మొత్తం -934 - 1142.54 -3,825

Next Story