రాజకీయ స్వలాభం కోసమే GHMC విస్తరణ.. బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

by Kema Shiva Kumar |

జీహెచ్ఎంసీ విస్తరణ నిర్ణయాన్ని ఇప్పటికీ బీజేపీ వ్యతిరేకిస్తున్నదని.. దీని వెనుక ఉన్నది ప్రజాప్రయోజనం కాదని.. రాజకీయ స్వలాభం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.

రాజకీయ స్వలాభం కోసమే GHMC విస్తరణ.. బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ విస్తరణ నిర్ణయాన్ని ఇప్పటికీ బీజేపీ వ్యతిరేకిస్తున్నదని.. దీని వెనుక ఉన్నది ప్రజాప్రయోజనం కాదని.. రాజకీయ స్వలాభం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. బుధవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మజ్లిస్ పార్టీకి ప్రత్యేక ప్రయోజనం కల్పించడం కోసమేనని ఈ విస్తరణ అని తెలుస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, కీలక గ్రామ పంచాయతీలను జోడించి జీహెచ్ఎంసీని విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నదని.. ఈ విస్తరణతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం దాదాపు 2,000 చదరపు కిలోమీటర్లకు పెరిగి, మొత్తం 300 వార్డులుగా పునర్విభజన జరుగుతుందని చెప్పారు. 69 లక్షల ఓటర్లు ఉన్న జీహెచ్ఎంసీని అకస్మాత్తుగా కోటి 69 లక్షల జనాభా స్థాయికి తీసుకువచ్చి, హైదరాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద నగరంగా మార్చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్నదని.. కానీ నిజానికి ఇప్పటికే జీహెచ్ఎంసీలోని అనేక వార్డుల్లో రోడ్లు సరిగా లేవని, సీవరేజ్ సిస్టమ్ లేదని, మౌలిక వసతులు సరిగ్గాలేవని అన్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకముందే, విస్తరణ పేరిట మరిన్ని ప్రాంతాలను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. విస్తరణతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపై పన్నులు పెరుగుతాయన్నారు. అంతేకాకుండా సామాన్య రైతుల భూములు ఇండస్ట్రియల్ ల్యాండ్‌గా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా, ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించకుండా, పబ్లిక్ డొమైన్‌లో వివరాలు షేర్ చేయకుండా ప్రభుత్వం ఈ విస్తరణ నిర్ణయం తీసుకోవడం పూర్తిగా తప్పుడు పద్ధతని అన్నారు. కొత్తగా ప్రతిపాదించిన 300 వార్డుల విభజనలో స్పష్టంగా రాజకీయ ప్రయోజనం దాగి ఉందని.. విస్తరణను మూడు భాగాలుగా చేస్తూ.. ప్రత్యేకంగా మజ్లిస్ పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు వచ్చేలా లైనప్ చేస్తూ.. రాజకీయ ప్రయోజనం కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తున్నదని ఆరోపించారు. ఈ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరూ వారం రోజుల్లో తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. బీఆర్ఎస్ దారిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని చెప్పారు.

హిల్ట్ పాలసీకి వ్యతిరేకం..

ఇంతటితో ఆగకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ల్యాండ్‌గా కన్వర్ట్ చేయాలనుకోవడం మరో పెద్ద అన్యాయమని రాంచందర్‌రావు అన్నారు. దీనిపై బీజేపీ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిందని.. ప్రజల అభిప్రాయాలు వినాలని, హియరింగ్స్ నిర్వహించాలని, పబ్లిక్ డొమైన్‌లో పూర్తి వివరాలు ఉంచాలని డిమాండ్ చేశారు. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం ప్రకటించిన రూ.5,50,000 కోట్ల పెట్టుబడులపై తీవ్రమైన సందేహాలు ఉన్నాయని.. ఇందులో డొల్ల కంపెనీలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. బీజేపీకి రాజకీయాలు ముఖ్యం కాదని.. ప్రజల అభివృద్ధే ముఖ్యమని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతంరావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీకరెడ్డి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్‌వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story