క్యూ ఆర్ కోడ్ ఆధారిత డోర్-టు-డోర్ చెత్త సేకరణ.. పైలెట్ ప్రాజెక్టు పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్

by Ramesh Naini |

క్యూ ఆర్ కోడ్ ఆధారిత డోర్-టు-డోర్ చెత్త సేకరణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు.

క్యూ ఆర్ కోడ్ ఆధారిత డోర్-టు-డోర్ చెత్త సేకరణ.. పైలెట్ ప్రాజెక్టు పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్యూ ఆర్ కోడ్ ఆధారిత డోర్-టు-డోర్ చెత్త సేకరణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. జవాబుదారీ తనం పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్క ఇంటి నుండి చెత్త సేకరణకు వీలవుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం రాజేంద్ర నగర్ జోన్ అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని హైదర్ గూడ నలంద నగర్ లో క్యూ ఆర్ కోడ్ ఆధారిత డోర్-టు-డోర్ చెత్త సేకరణ పైలట్ ప్రాజెక్టు అమలును జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కమిషనర్ (శానిటేషన్) రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తో కలిసి పరిశీలించారు. క్యూ ఆర్ కోడ్ ఆధారిత డోర్-టు-డోర్ చెత్త సేకరణ పనితీరును జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి కమిషనర్ కు వివరించారు. అనంతరం స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ తీరును కమిషనర్ క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడంలో స్వచ్ఛ ఆటో కార్మికులది క్రియాశీలక పాత్ర అని కమిషనర్ చెప్పారు.

ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజూ తప్పనిసరిగా డోర్-టు-డోర్ చెత్త సేకరణ చేసేలా పర్యవేక్షణ చేయాలని డిప్యూటీ కమిషనర్‌లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డీఈఈ, ఏఈలను కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. స్వచ్ఛ ఆటో కార్మికులకు చెత్తని అందించని ఇండ్లు ఏమైనా ఉంటే క్షేత్రస్థాయిలో అధికారులు గుర్తించి వారిని తప్పనిసరిగా చెత్త అందించేలా మోటివేట్ చేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు, పనితీరు, సూపర్వైజర్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యం సహించబోమని కమిషనర్ హెచ్చరించారు. పారిశుద్ధ్య సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలని డిప్యూటీ కమిషనర్‌లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డీఈఈ, ఏఈలకు ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రతపై అవగాన, చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని కమిషనర్ సూచించారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ లో వచ్చే ఫలితాలు సానుకూలంగా ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలో దీనిని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Next Story