- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ganja: పట్టణాలనుంచి పల్లెలకు పాకిన గంజాయి మత్తు
పట్టణాలకే పరిమితమైన గంజాయి మహమ్మారి నేడు గ్రామాలకు పాకింది. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి చోరీలకు, సంఘ విద్రోహ పనులకు పాల్పడుతున్నారు.

పట్టణాలకే పరిమితమైన గంజాయి మత్తు క్రమంగా పల్లెలకు పాకింది. యువత, విద్యార్థులు గంజాయికి బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మత్తులో చోరీలు, సంఘవిద్రోహ చర్యలకు పాల్పడుతూ కనిపెంచిన తల్లిదండ్రులకు, గ్రామానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులే లక్ష్యంగా కేసముద్రం పట్టణంలో గుట్టుగా గంజాయి విక్రయాలు చేపడుతున్నట్లు సమాచారం. పాన్‌షాపులే అడ్డాగా సిగరెట్ల మాటున గంజాయి అమ్మకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒత్తిడి, ఒంటరితనం, చెడు స్నేహాలతో ఎక్కువగా యువత గంజాయికి బాసినగా మారుతున్నారు. కొందరు యుక్తవయస్సులోనే అనారోగ్యం బారిన పడి మానసిక రోగులుగా మారుతున్నారు. పిల్లల కదలికలు, ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టిసారించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
దిశ, కేసముద్రం:విద్యార్థులు, యువత గంజాయికి అలవాటు పడి తమ బంగారు భవితను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తెస్తాడని తల్లిదండ్రులు కలలు కంటుంటే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నాడు పట్టణాలకే పరిమితమైన గంజాయి మహమ్మారి నేడు గ్రామాలకు పాకింది. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి చోరీలకు, సంఘ విద్రోహ పనులకు పాల్పడుతున్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులే లక్ష్యంగా గ్రామ శివారులోని గుట్టలను అడ్డాగా చేసుకొని గంజాయి వ్యాపారానికి దిగారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి కొందరు యువకులే మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం కేసముద్రం పట్టణంలో పోలీసులు సుమారు 16 కేజీల గంజాయిని పట్టుకోవడంతో కలకలం రేపింది. కేసముద్రం పట్టణంలో గంజాయి విక్రయాలు ఏమేరకు సాగుతున్నాయో ఈ ఘటనే నిదర్శనం. కొందరు యువకులు మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సిగరెట్ తంబాకు స్థానంలో ఎండు గంజాయి నింపుకొని దమ్ము లాగిస్తున్నారు. గంజాయి మత్తులో యువకులు పలు నేరాలకు పాల్పడుతున్నారు. స్నేహం పేరిట, జల్సాల పేరుతో గంజాయి వ్యసనానికి అలవాటుపడి బానిసలుగా మారుతున్నారు. యుక్తవయస్సులోనే అనారోగ్యం పాలై మానసిక రోగులుగా మారి విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. తొలి దశలో గుర్తించలేని తల్లిదండ్రులు ఆలస్యంగా తెలుసుకుని తమ పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పిస్తూ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు పడరానిపాట్లు పడుతున్నారు.
పిల్లల కదలికలపై దృష్టి పెట్టాలి..
పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకసారి గంజాయి, డ్రగ్స్‌వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే వాటిని మానేలా చేయడం కష్టంగా మారుతుంది. కొందరు ఒత్తిడి, ఒంటరితనంతో, మరిందరు చెడు స్నేహాలతో ఈ ఊబిలోకి దిగుతున్నారు. ఒక్కసారి గంజాయి తాగితే దానికి ఆకర్షితులవుతారు. మెదడును ఉత్తేజపరిచే గంజాయి క్రమంగా దానికి బానిసను చేస్తుంది. తర్వాత మెదడు చురుకుదనం కోల్పోయి మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.
ప్రాథమిక స్థాయిలోనే అరికట్టాలి..
గంజాయి మత్తుకు బానిస అయ్యి తీవ్ర మానసిక సమస్యలకు దారి తీయక ముందే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. అతిగా మద్యం, పొగ, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకోవడంతో శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వాటిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించాల్సిన అవసరముంది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రాత్రివేళల్లో పార్టీలంటూ తరచూ పిల్లలు స్నేహితులతో బయటకు వెళ్తుంటే వారిపై ఓ కన్నేసి ఉంచాల్సిందే. ముఖ్యంగా ఇంట్లో భార్య భర్తలు ఉద్యోగులైతే పిల్లలు తాము ఒంటరి అనే భావన కలిగి చివరికి చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. కనీసం వారంలో ఒకరోజైనా పిల్లలతో తల్లిదండ్రులు గడపాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్నప్పటి నుంచి విలువలు నేర్పిస్తూ పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శంగా నిలవాలని సూచిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపించినా తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.
పాన్ షాపులే అడ్డాలు..
యువతను పెడదారి పట్టిస్తున్న గంజాయి ఎక్కడ దొరుకుతుంది? అని ఆరా తీస్తే కొన్ని పాన్ షాప్ లే కేంద్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాన్ షాప్ లో సిగరెట్‌తో పాటు గంజాయి కొనుగోలు చేసి పొగ పీలుస్తున్నట్లు సమాచారం. మరికొంతమంది గంజాయి విక్రయాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది.
కఠిన చర్యలు తీసుకుంటాం -కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజ్
యువత గంజాయి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ పిల్లలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. యువత తమ ఉజ్వల భవిష్యత్తు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. గంజాయి రవాణా చేసినా, విక్రయించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. గంజాయి సమాచారం తెలిస్తే వెంటనే డయల్100కు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాము.






