పొట్టొన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోశమ్మ కొట్టిందట.. దొంగలను దోచుకున్న దొంగలు.. ఇక్కడే అసలు ట్విస్ట్

by Bhanu |

హైదరాబాద్ లో ఓ దోపీడీ దొంగతనం సినిమా ట్విస్టులను తలపించింది. పథకం వేసి ఒక ముఠా దోపీడీకి పాల్పడితే.. ఈఎంఐ కట్టలేదని వాహనం జప్తుకు వెళ్ళిన గ్యాంగ్ బ్యాగు నిండా డబ్బు చూసే సరికి వారి బుద్ధి మారింది.

పొట్టొన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోశమ్మ కొట్టిందట.. దొంగలను దోచుకున్న దొంగలు.. ఇక్కడే అసలు ట్విస్ట్
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ లో ఓ దోపీడీ దొంగతనం సినిమా ట్విస్టులను తలపించింది. పథకం వేసి ఒక ముఠా దోపీడీకి పాల్పడితే.. ఈఎంఐ కట్టలేదని వాహనం జప్తుకు వెళ్ళిన గ్యాంగ్ బ్యాగు నిండా డబ్బు చూసే సరికి వారి బుద్ధి మారింది. అంతే నగదు ఉన్న బ్యాగుతో ఉడాయించారు. దోపీడీకి గురైన బాధితుడు ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులకు సిని థ్రిల్లర్ ను తలపించే డెకాయిటీ క్రైం సీన్ స్పష్టమైంది. మొత్తం 28 మందిని ఈ నేరంలో గుర్తించిన హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు మంగళవారం 18 మందిని అరెస్టు చేశారు. మరో 10 మంది పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఒకరు టీజీఎస్పి కానిస్టెబుల్ కూడా ఉన్నారు.

నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ , అదనపు డీసీపీలు అశొక్ కుమార్, మహాంకాళి ఏసీపీ సైదయ్యలతో కలిసి వివరాలను వెల్లడించారు. ఏపీ క్రిష్ణా జిల్లాకు చెందిన చంద్రశేఖర్ వర్మ, నాగరాజు కుమార్ లు అన్నదమ్ములు. వీరు తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించి దోపీడీలకు పాల్పడుద్దామని పథకం వేశారు. నగదులో చెల్లించే వారికి మాత్రమే ఈ ఆఫర్ ఇద్దామని ప్లాన్ చేశారు. అలా నగదుతో ముందుకు వచ్చే వారిని టార్గెట్ చేసి లావాదేవిలు జరుపుతున్న సమయంలో తమ అనుచరులను నకిలీ పోలీసు రూపంలో దించి నగదును దోచుకుని పారిపోవాలని స్కెచ్ వేసుకున్నారు. ఇలా సికింద్రాబాద్ పాట్ మార్కెట్ ప్రాంతంలోని బంగారం దుకాణం యజమానులను టార్గెట్ చేశారు.

దోపీడీ సీన్ ప్రారంభం అయ్యింది ఇలా

సికింద్రాబాద్ పాట్ మార్కెట్ లో హరిరామ్ బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని దగ్గర రాంబాబు, రాధేశ్యామ్ పని చేస్తున్నారు. చంద్రశేఖర్ వర్మ స్కెచ్ ను తెలుసుకున్న రాధేశ్యామ్, హరిరామ్ కు మీ దగ్గర నగదు ఉంటే ఐదు శాతం తక్కువ ధరకు కేజీ బంగారాన్ని ఇవ్వడానికి తెలిసిన వారు ఉన్నారని చెప్పారు. హరిరామ్ కు ఈ ఆఫర్ నచ్చి బంగారాన్ని కొనడానికి సిద్ధమయ్యాడు. నగదుతోనే కొనేందుకు రెడీ అన్నాడు. ఈ నెల 18 వ తేదిన చంద్రశేఖర్ వర్మ, నాగరాజులు తన అనుచరులతో సికింద్రాబాద్ బ్లూ సీ హోటల్ వద్ద సమావేశమయ్యారు. ఆ తర్వాత రాధేశ్యామ్ రాంబాబును హరిరామ్ దగ్గరకు తీసుకుపోయాడు. అక్కడ రాంబాబు డబ్బు చూసుకుని మా వాళ్లు బంగారం తీసుకువస్తారని చెప్పి లొకేషన్ ను తన గ్యాంగ్ కు పంపాడు. మొత్తం నలుగురు హరిరామ్ ఉన్న చోట కు వెళ్ళి మేము రాచకొండ ఎస్ఓటీ పోలీసులమంటూ ఐడి కార్డును చూపించి హరిరామ్ ను చితకబాదారు, రాధేశ్యాంను బెదిరించారు. 46 లక్షలు నగదు ఉన్న బ్యాగుతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కారులో నలుగురు వెళ్ళిపోగా డబ్బును రాంబాబు, మరో అనుచరుడుభానులకు అప్పగించారు. ఈ ఇద్దరు డబ్బు ఉన్న బ్యాగుతో ద్విచక్రవాహనం మీద సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి వైపు వస్తున్నారు.

ఇక్కడే సినిమా త్రిల్లర్ ట్విస్టు

దోచుకున్న 46 లక్షల నగదుతో ఫుల్ ఖుషిలో ద్విచక్రవాహనం పై వస్తున్న భాను, రాంబాబులను తిరుమలగిరి వద్ద నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల ఆపారు. దీంతో భయాందోళనకు గురైన రాంబాబు, భానులు అప్పుడే పోలీసులకు తెలిసిపోయిందా అంటూ కంగారు పడ్డారు. వాహనాన్ని ఆపిన వారు మీ ద్విచక్రవాహనం పై ఈఎంఐలు పెండింగ్ లో ఉన్నాయి మీ బైక్ ను సీజ్ చేస్తున్నామని గొడవకు దిగారు. ఈ గొడవలో నలుగురు వారి దగ్గర ఉన్న బ్యాగును తనిఖీ చేశారు. అందులో డబ్బులు ఉండడంతో వారు ఈ ఇద్దర్నీ బెదిరించి ఆ నగదు ఉన్న బ్యాగుతో పారిపోయారు. వెంటనే ఈ విషయాన్ని రాంబాబు ప్రధాన సూత్రధారి చంద్రశేఖర్ వర్మ కు చెప్పాడు. అతను వాహనాన్ని సీజింగ్ చేసిన రోషన్ అండ్ గ్యాంగ్ తో గొడవపడ్డాడు.

100 సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు

హరిరామ్ ఫిర్యాదుతో దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు మొత్తం 100 సీసీ కెమెరాలను శోధించారు. అందులో దొరికిన ఆధారాలతో మొత్తం 28 మందిని గుర్తించారు. అందులో 18 మందిని అరెస్టు చేశారు. విచారణలో దోపీడీకి స్కెచ్ వేసిన ఒక ముఠా అయితే....సీజీంగ్ కోసం వచ్చి దోపీడీ చేసిన వారి నుంచి నగుదును దోచుకుని వెళ్ళింది మరో ముఠా అని గుర్తించి పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. మోసగాళ్లకు మొసగాళ్లుగా ఈ దోపీడీ సంఘటన ఇప్పుడు సంచలనం రేపుతుంది. పరారీలో ఉన్న మరో 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. 46 లక్షల నగదు, 23 మొబైల్ ఫోన్ లు , రెండు కార్లు, నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ ఎస్ఓటీ పోలీసు అంటూ ఐడి కార్డు చూపించి బెదిరించిన వ్యక్తి నాగర్ కర్నూలు కు చెందిన కేశవులుగా పోలీసులు గుర్తించారు. అతను టీజీఎస్పి విభాగంలో కానిస్టెబుల్ గా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ డెకాయిటీ మిస్టరీని చేధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Next Story