గణేశ్ నిమజ్జనంలో అపశృతి.. టస్కర్‌ ఢీకొని జీహెచ్ఎంసీ కార్మికురాలు మృతి

by Ramesh Naini |   (  Updated:2025-09-07 07:46:41  IST  )

హైదరాబాద్‌‌లో వినాయక నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు ట్రక్కు ఢీకొని మృతి చెందారు.

గణేశ్ నిమజ్జనంలో అపశృతి.. టస్కర్‌ ఢీకొని జీహెచ్ఎంసీ కార్మికురాలు మృతి
X

దిశ, హిమాయత్ నగర్: ప్రమాదవశాత్తు టస్కర్ వాహనం కిందపడి ఓ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుడిమల్కాపూర్ కు చెందిన రేణుక గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తుంది. ఆదివారం ఉదయం బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో.. మూత్ర విసర్జన కోసం రోడ్డును దాటేందుకు యత్నించింది. అదే సమయంలో బషీర్‌బాగ్ నుంచి వస్తున్న టస్కర్ వాహనం కింద రేణుక ప్రమాదవశాత్తు పడటంతో ఆమెపై నుంచి వాహనం వెళ్ళింది. దీంతో ఆ మహిళ తలకు బలమైన గాయం కావడంతో, అక్కడే ఉన్న మరికొందరు పారిశుద్ధ్య కార్మికులు ఆమెను పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో సైఫాబాద్ పోలీసులు టస్కర్ డ్రైవర్ గజానంద్ పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Next Story